8 July, 2026 | 1:20 AM

ప్రతాపన్నకు పదవీ యోగం ఎప్పుడో?

08-07-2026 12:31 AM
  1. ఏఐసీసీ నేత రాహుల్,  సీఎం రేవంత్ రెడ్డి హామీలు ఉత్తమాటలేనా...
  2. నిరాశలో అనుచర వర్గం 
  3. జన్మదిన వేడుకలకు దూరంగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

షాద్నగర్, జూలై 7 (విజయక్రాంతి): షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మంగళవారం తన జన్మదిన వేడుకలకు దూరంగా ముఖం చాటేశారు. ప్రతి ఏటా జూలై 7న నియోజకవర్గం లో అనుచరులు, అభిమానుల మధ్య అట్టహాసంగా బర్త్డే వేడుకలు జరుపుకునే ఆయన... ఈసారి ఎవరికీ అందుబాటులో లేకుండా హఠాత్తుగా విదేశాలకు వెళ్ళిపోవడం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిం ది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా తనకు ఎలాంటి నామినేటెడ్ పదవీ దక్కకపోవడం, అటు అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిళ్లకు సమాధానం చెప్పుకోలేకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాహుల్, సీఎం హామీ..అయినా దక్కని గుర్తింపు

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోరుట్ల విజయభే రి యాత్రలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ సమక్షం లో ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయం లో ఆయన రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇస్తామని పా ర్టీ పెద్దలు హామీ ఇచ్చారు. దానికి తోడు, గతంలో ప్రతాప్ రెడ్డి మనవడి పుట్టినరోజు వేడుకకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా హాజరుకావడంతో, ప్రతాప్పన్నకు నామినేటెడ్ పోస్ట్ ఖాయమని అందరూ భావించారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సైతం అధిష్టానం వద్ద ప్రతాప్ రెడ్డి పేరును గట్టిగా ప్రతిపాదించారు. అయితే, ఇటీవల విడుదలైన నామినేటెడ్ పదవుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో అటు ప్రతాప్ రెడ్డితో పాటు ఇటు ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ప్రశ్నిస్తున్న అనుచరులు.. తప్పుకున్న నాయకుడు

మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకుడిగా, సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ప్రతాప్ రెడ్డికి ప్రస్తుత సమీకరణాలు కలిసి రావడం లేదనే భావన వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసినా పదవి దక్కకపోవడంపై అనుచరులు నిత్యం ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో జనం మధ్య ఉంటే పదవి గురించిన ఇబ్బందికర ప్రశ్నలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళినట్లు తెలుస్తోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేడుకలకు ఆటంకాలు ఎదురయ్యేవని, ఇప్పుడు సొంత పార్టీ అధికారంలో ఉన్నా పట్టించుకునే నాథుడే లేకపోవడంతోనే ఆయన మనస్తాపానికి గురై ’బర్త్డే అజ్ఞాతవాసం’ ఎంచుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయ ప్రస్థానం చూస్తే..

1994  రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన షాద్నగర్ జెడ్పీటీసీగా ఘన విజయం. 2002 - 2004: బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి,2009 షాద్నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి 9,838 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం.2019 - 2023 లో రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్‌ఎస్లో చేరినా, అక్కడ ’పొమ్మనలేక పొగబెట్టడం’తో తిరిగి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లోకి పునరాగమనం చేశారు. పార్టీ ఇచ్చిన ఏ బాధ్యతనైనా ఎంతో నిజాయితీగా, క్రమశిక్షణతో నెరవేర్చే ప్రతాప్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడి అభ్యున్నతిపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా దృష్టి సారిస్తుందో లేదో చూడాలి. ఏది ఏమైనప్పటికీ, ప్రతాప్పన్న బర్త్డే రోజున షాద్నగర్లో లేకపోవడం మాత్రం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది.