calender_icon.png 21 May, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు పంటసాయం ఎప్పుడు?

29-11-2024 12:00:00 AM

రైతు భరోసా అమలు విషయంలో ‘గుడ్డికన్న మెల్లమిన్న’ అన్న భావనను రైతులలో కలుగ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆరెఎస్ ప్రభుత్వం ‘రైతుబంధు’ పేరుతో ప్రతీ సీజన్‌కు ఎకరాకు రూ. 5,000 చొప్పున ఆర్థిక సహాయం క్రమం తప్పకుండా అందించింది. తద్వారా రైతులకు ఒకింత ఆర్థిక చేయూతను లభించిన మాట నిజమే. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల వేళ ఎకరాకు రూ. 7,500 అని పెద్ద ఆశ చూపించింది. వారి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఆ హామీ కార్యరూపానికి రాకపోవడం బాధాకరం.

నవంబర్‌లో, లేకుంటే డిసెంబర్, కాకుంటే జనవరిలో వేస్తామంటూ పెద్దలు మాటలకే పరిమితం అవుతున్నారు. కనీస పంట పెట్టుబడి సాయం కోసం సామాన్య రైతులు ఒక రకంగా అల్లల్లాడుతున్నారు. చేసేది లేక బ్యాంకులలో, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర మళ్లీ అప్పులు చేయవలసి వస్తున్నది. కొందరైతే తమ భార్యల పుస్తేల తాళ్ళు, చెవి కమ్మలు తాకట్టు పెట్టి మరీ, డబ్బులు తెచ్చుకుంటున్న సన్నివేశాలు నిజంగా హృదయ విదారకం.

ఇప్పటికైనా, ప్రభుత్వం మరింత జాప్యం చేయకుండా ‘రైతు భరోసా’ డబ్బులు అందించాలి. ప్రతీ సీజన్‌లో క్రమం తప్పకుండా అందించగలిగితే అంతకంటే గొప్ప విజయం కాంగ్రెస్ పార్టీకి మరొకటి ఉండదేమో. సగటు రైతులకు వేన్నీళ్లకు చన్నీళ్ల మాదిరిగా ఆర్థిక సహాయం అందించినట్లు అవుతుంది. 

- ఎం. ధనంజయ్