వర్సిటీల్లో బోధకులేరీ?
- సగానికి పైగా ఖాళీలే
- ఏళ్లుగా భర్తీకి నోచని ప్రొఫెసర్ పోస్టులు
- కాంట్రాక్ట్, గెస్ట్‌లే దిక్కు
- కుంటుపడుతున్న బోధన, పరిశోధనలు
- ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులపైనా ప్రభావం
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): ఉన్నత విద్యకు దిక్సూచిగా నిలవాల్సిన యూనివర్సిటీలు అధ్యాపకుల కొరతతో సతమతమవుతున్నాయి. అధ్యాపక పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. మరోవైపు పరిశోధనలు కూడా కుంటుపడుతున్నాయి. రాష్ట్రంలో 11 యూనివర్సిటీలు ఉండగా అన్ని చోట్ల 50 నుంచి 90 శాతం వరకు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్రమం తప్పకుండా నియామకాలు చేపట్టాల్సిన ప్రభుత్వం,
నాన్చుడు ధోరణి అవలంభిస్తుందన్న విమర్శలున్నాయి. ఫలితంగా కాంట్రాక్ట్, పార్ట్‌టైం, గెస్ట్ ఫ్యాకల్టీలతో నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు జాతీయ స్థాయి ర్యాంకులపై ప్రభావం చూపుతున్నాయి.యూనివర్సిటీల్లో ఏటేటా అధ్యాపకుల సంఖ్య తగ్గుతున్నా ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై అధ్యాపక, విద్యార్థి సంఘాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉన్నత విద్యను విస్మరిస్తుందని ఆరోపిస్తున్నాయి.
12 ఏళ్లుగా నియామకాలు నిల్
యూనివర్సిటీల్లో 10 నుంచి 12 ఏళ్లుగా నియామకాలు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదే పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండున్నర ఏళ్లుగా నాన్చుతూ వస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో జీవో జారీ చేసినా, ఇప్పటి వరకు నియామక ప్రక్రియ చేపట్టలేదు. ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియను యూనివర్సిటీల కు ఇవ్వాలా? ప్రత్యేక బోర్డు ద్వారా చేపట్టాలా? అనే దానిపై స్పష్టమైన విధానమే లేదు. దీంతో కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్, అకడమిక్ కన్సల్టెంట్లు, గెస్ట్ ఫ్యాకల్టీలతోనే వర్సిటీలను నెట్టుకొస్తున్నారు.
దీంతో తెలంగాణ విశ్వవిద్యాలయాలు నాణ్యత, రీసెర్చ్‌తో పాటు అనేక అంశాల్లో అట్టడుగు స్థాయికి వెళ్తున్నాయి. నేషనల్ ఇనిస్టిట్యూషన ల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్), న్యాక్ అక్రిడిటేషన్‌లోనూ వెనుకబడుతున్నాయి. రాష్ట్రంలోని వర్సిటీల ర్యాంకింగ్‌లు పడిపోతున్నాయి. ఇక ప్రపంచ స్థాయి ర్యాంకింగ్‌లో ఉనికే లేదు.
యూనివర్సిటీల వారీగా ఖాళీలు
ఒక్కో యూనివర్సిటీలో 50 నుంచి 90 శాతం వరకు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓయూలో 1,267 పోస్టులకు 936 (74 శాతం) ఖాళీలున్నాయి. బాసర ఆర్జీయూకేటీలో 146 పోస్టులకు 127 (86 శాతం) పోస్టులు ఖాళీలే. కాకతీయ యూనివర్సిటీలో 439 పోస్టులకు గాను 332 (75 శాతం), శాతవాహనలో 63 పోస్టులకు 47 (74 శాతం), జేఎన్టీయూలో 410 పోస్టులకు 266 (65 శాతం), తెలుగు యూనివర్సిటీలో 77 పోస్టులకు 64 (83 శాతం), మహాత్మాగాంధీ వర్సిటీలో 70 పోస్టులకు 35 (50 శాతం), బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో 93 పోస్టులకు 69 (74 శాతం), తెలంగాణ వర్సిటీలో 152 పోస్టులకు 91 (59 శాతం), పాలమూరు వర్సిటీలో 136 పోస్టులకు 117 (86 శాతం) ఖాళీలున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో 55 పోస్టులకుగానూ 41 (74 శాతం) పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. కొన్ని విభాగాలకు హెచ్‌వోడీ (హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్) కూడా లేరు.
ఆర్థిక ఇబ్బందులే కారణమా?
విద్యారంగం, విద్యార్థులపై ఖర్చు చేసే ప్రతీ రూపాయిని పెట్టుబడిగా చూడాలని పలు వేదికలపై స్పష్టం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ముందడుగు వేయలేకపోతున్నారనే విమర్శులున్నాయి. వేల ఖాళీ పోస్టులను ఒకేసారి భర్తీ చేయటం వల్ల పెద్ద ఎత్తున వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడనుంది. ఇప్పటికే ఆర్థిక లోటను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వంపై మరింత భారం పడే అవకాశం ఉంటుంది. మరోవైపు న్యాయపరమైన అడ్డంకులు, చిక్కులు తలెత్తకుండా పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.






