calender_icon.png 9 August, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధీ నీ జాడెక్కడ?

09-08-2025 01:38:36 AM

- మహేంద్ర కాలనీలో పేరుకుపోయిన సమస్యలు

- నిండిపోయిన మురుగుకాలువలు 

- రోడ్లన్నీ చిత్తడి చిత్తడి నిద్రమత్తులో మున్సిపల్ అధికారులు 

జహీరాబాద్, ఆగస్టు 7 : జహీరాబాద్ మునిసిపల్ పరిధిలోని మహేంద్ర కాలనీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రభుత్వాలు మారినా ప్రజా ప్రతినిధులు మారినా మహేంద్ర కాలనీ స్థితిగతులు మారడం లేదు. ఈ కాలనీలో మహేంద్ర కంపెనీకి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగులతో పాటు వివిధ రంగాలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు కార్మికులు, వ్యాపారస్తులు నివాసం ఉంటున్నారు. ఈ కాలనీలోని రోడ్లన్నీ వర్షం పడితే నడవడానికి కూడా వీలు లేకుండా బురదతో నిండుకుంటాయి.

ఇదే కాకుండా మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో వర్షం పడిన వెంటనే మురుగు కాలువలలో మురుగునీరు రోడ్లపైకి వచ్చి ప్రవహిస్తుంది. దీంతో తీవ్ర దుర్గంధంతో ఈ కాలనీవాసులు కొట్టుమిట్టాడుతున్నారు. తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తుండడంతో పరిపాలన కుంటుపడింది. ఇక్కడ కౌన్సిలర్లు లేకపోవడంతో కాలనీ ఇబ్బందులను అధికారుల దృష్టికి కానీ ప్రజా ప్రతినిధుల దృష్టికి కానీ తీసుకువెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. 

నిద్రావస్థలో బల్దియా అధికారులు...

మున్సిపల్ అధికారులు ఈ కాలనీ యొక్క దుస్థితి తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదు. కాలనీలోని ఇండ్ల పన్నులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారే తప్ప కాలనీ బాగోగుల గురించి పట్టించుకునే పాపాన పోలేదని కాలనీవాసులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రధాన రహదారి నుండి అల్లిపూర్ దర్గా ఇరువైపుల రోడ్లు కూడా బురదమయంగా మారి నడవడానికి వీలు లేకుండా పోతుంది. కాలనీలోని అంతర్గత రోడ్లు కూడా గుంతలమ యంతో దర్శనమిస్తున్నాయి. బడి పిల్లలు కాలినడకన వెళ్లలేక ద్విచక్ర వాహనాలు, కార్లలో వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు ఎక్కడైనా వెళ్ళినట్లయితే ఆ రోజు పిల్లలు పాఠశాలకు వెళ్లే పరిస్థితులు లేవు.

అధికారులు మాత్రం పన్నులను క్రమం తప్పకుండా వసూలు చేస్తున్నారు కానీ మహేంద్ర కాలనీ సమస్యలను గురించి పట్టించుకున్న నాథుడు లేడని కాలనీవాసులు అంటున్నారు. మహేంద్ర కాలనీలో కొన్ని ప్లాట్లలో ఇండ్లు నిర్మించకపోవడంతో ఆ స్థలాలలో చెత్తను వేయడంతో దుర్గంధంతోపాటు విపరీతమైన దోమలు ప్రబలుతున్నాయి. కరెంటు లేని సమయంలో దోమలు అధికం కావడం వల్ల ప్రజలు అనారోగ్యం భారిన పడుతున్నట్లు కాలనీవాసులు తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు గాఢ నిద్ర వదలి సమస్యలపై దృష్టి సారించి కాలనీలోని రోడ్లను మరమ్మత్తులు చేయాలని, సక్రమంగా లేని మురుగు కాలువను కూడా నిర్మించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.