16 August, 2026 | 1:15 AM

చర్చలు జరగని చట్టసభలెందుకు?

16-08-2026 12:00 AM

డా.తిరునహరి శేషు :

ప్రజా సమస్యలను, ప్రభుత్వ విధానాలలో ఉన్న లోటుపాట్లను చర్చించటానికి దేశంలో పార్లమెంట్, రాష్ట్రాల్లో అసెంబ్లీలను ఏర్పాటు చేశారు. ఈ చట్టసభలకి ఎన్నికైన, ఎంపికైన ప్రజాప్రతినిధులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రభుత్వం రూపొందిస్తున్న విధానపరమైన నిర్ణయాలపై ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను సమావేశాలు జరుగుతున్న సమయంలో చట్టసభల దృష్టికి తేవాలి.

తద్వా రా ఆ అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగినప్పుడు చట్టసభల గౌరవం, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కానీ, గత కొంతకాలంగా దేశంలోనూ, రాష్ట్రాలలోనూ చట్టసభలలో ప్రజా సమస్యలపైగాని, ప్రభుత్వ విధానాలపైగాని అర్థవంతమైన చర్చలు జరగకపోగా చట్టసభలు వ్యక్తిగత దూషణలకి, రాజకీయ విమర్శలకి వేదికలుగా మారిపోయాయి.

జూలై 24న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిశాయి. దరిదాపు 19 రోజులు జరిగిన సమావేశాలలో పార్లమెంట్‌లోని ఉభయ సభలలో వివిధ అంశాలపై 96 గంటలు చర్చ జరగాలి. కానీ లోక్‌సభలో 16.7 గంటలు, రాజ్యసభలో 31.2 గంటలు మాత్రమే చర్చలు జరిగాయి. అంటే అత్యంత విలువైన పార్లమెంట్ సమయం వృధా అయ్యిందనే విషయాన్ని గమనించాలి.

పార్లమెంట్ సమావేశాలు నిర్వహించటానికి ఒక నిమిషానికి రూ.2.5 లక్షలు, ఒక గంటకి రూ.1.5 కోట్లు, ఒక రోజుకి రూ.9 కోట్ల వరకు ఖర్చవుతుంది. అంటే ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించటానికి దాదాపుగా రూ.171 కోట్లు ఖర్చయింది. కానీ, పాలక, ప్రతిపక్షాల మధ్య సభలో చర్చించే అంశాలపై, ప్రతిపక్షాల ప్రతిపాదనలపై సయోధ్య కుదరకపోవటం వల్ల ఉభయ సభలలో గందరగోళం ఏర్పడింది.

దీంతో తరచూ సభలు వాయిదా పడటం, పార్లమెంట్ ప్రాంగణంలో పాలక, ప్రతిపక్షాలు ఆందోళనలతో ఈ సమావేశా లు వర్షార్పణమయ్యాయి. ఈ సమావేశాలు జరిగిన తీరు చూసిన తర్వాత కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజా సమస్యలను చర్చించని చట్టసభలు ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

దీనికి బాధ్యులు ఎవరు? 

విలువైన సభా సమయాన్ని వృథా చేస్తూ, ప్రజా సమస్యలపై చట్టసభలలో అర్థవంతమైన చర్చలు జరగకపోవటానికి కారణం ఎవరు? బాధ్యత ఎవరిది? అనే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ  జరుగుతున్నది. సభను సజావుగా నిర్వహించడానికి అనుకూలమైన కార్యాచరణని ప్రభుత్వం రూపొందించాలి. ప్రతిపక్షం వివిధ అంశాలపై తమ బలమైన వాదన వినిపిస్తూ సభ నిర్వహణకు సహకరించాలి. అప్పుడే సభలో అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఏర్పడుతుంది.

ప్రజాస్వామిక వ్యవస్థలలో చట్టసభలు బలమైన వేదికలు. కానీ ఈ వేదికల ను ఉపయోగించుకొని ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వ విధానాలలోని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు వైఫల్యం చెందటం వల్ల చట్టసభలపై గౌరవం తగ్గిపోతున్నది. పేపర్ లీకేజీ, విద్యార్థులపై లాఠీచార్జి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు సభలో చర్చకు రావద్దని పాలకపక్షాలు కోరుకోవటం సహజమే.

కానీ తాము లేవనెత్తిన అంశాలే చర్చకు స్వీకరించాలని ప్రతిపక్షాలు మొండిపట్టు పట్టడం వల్లనే కొన్ని సందర్భాలలో కీలకమైన అంశాలపై చట్టసభలలో చర్చలు జరగటం లేదు. సభ సజావుగా నడవకపోవటానికి, సభలో కీలక అంశాలపై చర్చ జరగకపోవటానికి పాలక, ప్రతిపక్షాలు రెండూ బాధ్యత వహించాలి. అయితే, సభ సజావుగా, హుందాగా, అర్థవంతంగా నడవకపోవడం ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలి. 

ఈ వర్షాకాల సమావేశాలలో భవిష్యత్తులో పరీక్ష పత్రాల లీకేజ్ జరగకుండా కఠినమైన చర్యలు చేపట్టడానికి తీసుకువచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్‌మెంట్   బిల్‌X 2026 పై ఉభయసభలలో చర్చించి ఆమోదించారు. కానీ సంసద్ ముట్టడి సందర్భంగా విద్యార్థులపై లాఠీచార్జి, అయోధ్య రామమందిరంలో జరిగిన విరాళాల చోరీ వంటి అంశాలపై చర్చించటానికి ప్రభుత్వం మీనమేషాలు  ఎందుకు లెక్కించింది? అన్నది ఇక్కడ చర్చనీయాంశం. అయితే, ప్రతిపక్షాలు ఈ అంశాలపై చర్చించాలని మొండిపట్టు పట్టడంతో చివరి రోజు కూడా ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాలు ముగిశాయి.

చట్టసభలలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలి. 16వ, 17వ లోక్‌సభలకు భిన్నంగా 18వ లోక్‌సభ కనిపిస్తున్నది. 16వ, 17వ లోక్‌సభలలో పాలకపక్షం అత్యంత బలంగా ఉండగా, సభలో కాంగ్రెస్ పార్టీతో సహా ఏ ఒక్క పార్టీకి కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా దక్కలేదు. పాలకపక్షం బలంగా ఉండటంతో మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటి కీలకమైన బిల్లులతో సహా 370 ఆర్టికల్ రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు, మూడు వ్యవసాయ సాగు చట్టాలు లాంటి వివాదాస్పదమైన బిల్లులను కూడా అవలీలగా ప్రభుత్వం ఆమోదింపజేసుకున్నది.

కానీ 18వ లోక్‌సభలో మాత్రం బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవటం, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతుతో సాధారణ మెజార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, మరొకవైపు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా పొందటం, రాహుల్‌గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికవడం, లోక్‌సభ లో ప్రతిపక్షాల సంఖ్య గణనీయంగా ఉండటంతో ప్రభుత్వం సభను గతంలో లాగా ఏకపక్షంగా నడిపించలేకపోతున్నది. కొన్ని కీలకమైన బిల్లులను కూడా ఆమోదింపజేసుకోలేకపోతున్నది.

జమిలి బిల్లు, వక్ఫ్ బోర్డ్ ఆస్తుల సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీలు వేసినట్లుగానే, ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుని సభలో ప్రవేశపెట్టకుండానే జేపీసీ వేశారు. వర్షాకాల సమావేశాలకు ముందు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా లోక్‌సభలో ఆమోదం పొందలేకపోయింది.

ఎవరి లెక్కలు వారివి

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల మొదటి రోజే సంసద్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులపై లాఠీచార్జి జరగటం, లాఠీచార్జికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఉభయ సభలలో ప్రతిపక్షాల నిరసనలతో సమావేశాలు సజావుగా సాగలేదు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత కూడా పార్లమెంట్ ఉభయ సభలలో నెలకొన్న పరిస్థితులలో ఏ మాత్రం మార్పు రాలేదు. లోక్‌సభలో గందరగోళ పరిస్థితుల దృష్ట్యా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‌కి వచ్చినా, సభకి హాజరు కాలేదు.

విద్యార్థులపై లాఠీచార్జికి ఎవరు ఆదేశించారు? చందా చోర్‌పై విపక్షాలు చర్చకు పట్టుబట్టడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించాయి. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ రాష్ట్రానికి సంబంధించిన అంశమని, లాఠీచార్జిపై చర్చించటానికి ప్రభు త్వం సిద్ధంగా ఉందని, దాచటానికి ప్రభుత్వం వద్ద ఏమీ లేదని బీజేపీ సర్కార్ ప్రకటన చేసింది. అయినా విపక్షాలు సంతృప్తి చెందలేదు.

దీంతో కేవలం 19 శాతం ఉత్పాదకత తో లోక్‌సభ సమావేశాలు సరైన చర్చ జరగకుండానే ముగిశాయి. విద్యార్థి ఉద్యమకారులపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేయటానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఒకవేళ అమిత్ షానే ఆదేశాలు ఇస్తే బాధ్యత వహించి రాజీనామా చేయాలని  లేదా లాఠీచార్జికి ఆదేశాలు ఇవ్వకపోతే జరిగిన ఘటనకి బాధ్యత వహిస్తూ తన వైఫల్యంగా అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షం పట్టుబట్టింది.

దీంతో సహజంగా సభ నిర్వహణలో పైచేయి సాధించే పాలకపక్షం ఒకింత ఆత్మరక్షణలో పడింది. సభలో ఈ కీలక అంశాల పై చర్చ జరిగితే ప్రభుత్వానికి మరింత రాజకీయంగా నష్టం జరిగే అవకాశాలు కనిపించడంతో ఈ చర్చకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు.

పాలక, ప్రతిపక్షాలు జవాబుదారీతనంగా పట్టు విడుపులు ప్రదర్శించకపోవడంతో విలువైన సభా సమయం, ప్రజాధనం వృథా అయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల తీరు చూసిన తరువాత ప్రజా సమస్యలపై చర్చించని చట్టసభలు ఎందుకనే ప్రశ్న  ఉదయించక మానదు.

 వ్యాసకర్త సెల్: 9885465877