అగ్రవర్ణంలో అట్టడుగు బతుకులు!
ఏ చంద్రశేఖరరావు :
సమాజంలో ‘అగ్రవర్ణం’ అనే ముద్ర.. క్షేత్రస్థాయిలో అనుభవిస్తున్న దారుణమైన దారిద్య్రం.. ఈ రెండింటి మధ్య తెలంగాణలోని బ్రాహ్మణ సామాజికవర్గం నలిగిపోతోంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కులగణన వివరాలు ఈ సామాజికవర్గం వాస్తవ స్థితిని ప్రపంచం ముందుకుతెచ్చాయి. ఒకప్పుడు సామాజిక, రాజకీయ రంగాల్లో వెలుగొందిన ఈ సమాజం, నేడు మారుతున్న ఆర్థిక సమీకరణాల వల్ల నిశ్శబ్దంగా నరకాన్ని అనుభవిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే ప్రకారం తెలంగాణలో బ్రాహ్మణులు 3,35,806 మంది ఉన్నారు. మొత్తం 1,09,825 కుటుంబాలు ఉండగా, రాష్ట్ర జనాభాలో ఈ సామాజికవర్గం వాటా 0.9 శాతం మాత్రమే.ఓసీ జనాభాలో బ్రాహ్మణుల 6 శాతంగా ఉన్నది. రాష్ట్ర జనాభాలో 1 శాతం కంటే తక్కువగా (0.9%) ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గం ఓసీ గ్రూపు లో రెడ్డి (4.8%), కోమటి (1.4%), కమ్మ (1.0%) కులాల తర్వాత నాల్గవ స్థానంలో ఉంది.
అర్చకత్వంలో ఆకలి కేకలు
ఇటీవల వెలువడిన పలు గణాంకాల ప్రకారం బ్రాహ్మణులలో దాదాపు 75 శాతం మంది భూమి, స్థిరాస్తులు లేని నిరుపేదలే కావడం గమనార్హం. సాంప్రదాయికంగా పూజలు, పౌరోహిత్యం, వేద విద్యలపై ఆధారపడిన వీరికి మారుతున్న కాలంలో ఆదా యం గణనీయంగా పడిపోతోంది.
రాష్ట్రంలోని చిన్న గ్రామాల్లో, ధూప-దీప నైవేద్యాల కింద నడిచే ఆలయాల్లో పనిచేసే అర్చకుల నెలవారీ ఆదాయం కనీస వేతనం కంటే చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్ వంటి నగరాల్లో వేలాది బ్రాహ్మణ కుటుంబాలు సొంత ఇల్లు లేక, పెరిగిన అద్దెలు కట్టలేక మురికివాడలను తలపించే చిన్న చిన్న ఇళ్లలో జీవిస్తున్నారు.
రిజర్వేషన్లు లేవు.. ఆస్తులు లేవు బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సామాజిక గుర్తింపులో ఉన్న ద్వంద్వ విధానం. కేంద్రం ప్రవేశపెట్టిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కొంత ఊరటనిచ్చినప్పటికీ, సర్టిఫికెట్ల జారీలో ఉన్న కఠిన నిబంధనల వల్ల నిజమైన పేద బ్రాహ్మణులకు విద్యా, ఉద్యోగాల్లో పూర్తిగా న్యాయం జరగడం లేదు. అగ్రవర్ణం అనే ముద్ర వల్ల సాధారణ సంక్షేమ పథకాలు కూడా (ఉచిత గృహాలు, సబ్సిడీ రుణాలు) వీరికి దక్కడం లేదు.
రిజర్వేషన్ల చర్చలో మరో వాదన
అగ్రవర్గం అనే సామాజిక వర్గీకరణ కారణంగా బ్రాహ్మణ సమాజంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలు అవకాశాల విషయంలో నష్టపోతున్నాయనే వాదనలు ఇటీవలి కాలంలో మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారందరూ ఆర్థికంగా, విద్యాపరంగా సమాన స్థితిలో లేరని, పేదరికాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం చారిత్రకంగా వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం, అవకాశాలు కల్పించడమే అయినప్పటికీ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అగ్రవర్ణ కుటుంబాల పరిస్థితిపై కూడా ప్రత్యేక దృష్టి అవసరమనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బ్రాహ్మణ సమాజంలోని పేద విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా సహాయం వంటి అంశాల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఇటీవలి కాలంలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.
కులం ఆధారంగా కాకుండా ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని కూడా సమగ్రంగా అంచనా వేయాలనేది ఈ వర్గం నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్. అయితే, రిజర్వేషన్ వ్యవస్థపై చర్చలో చారిత్రక సామాజిక వివక్ష, ప్రాతినిధ్యం, రాజ్యాంగపరమైన నిబంధనలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
అందువల్ల అన్ని వర్గాల పేదలకు విద్య, ఉపాధి, సంక్షేమ అవకాశా లు మరింత అందుబాటులోకి వచ్చేలా విధివిధానాలను రూపొందించాలనే డిమాండ్ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయాన్ని కాపాడుతూనే, ఆర్థికంగా వెనుకబడిన ప్రతి కుటుంబానికి సమాన అవకాశాలు ఎలా కల్పించాలి? అనేది ప్రశ్నగా మిగులుతుంది.
రాజకీయ శూన్యత
రాజకీయ రంగంలో బ్రాహ్మణుల ప్రాతినిధ్యం దాదాపు శూన్య స్థాయికి పడిపోయింది. 0.9 శాతం జనాభా మాత్రమే ఉండ టం వల్ల ఏ ఒక్క నియోజకవర్గంలోనూ వీరు గెలుపోటములను ఒంటరిగా శాసించే పరిస్థితి లేదు. ప్రధాన పార్టీలు బ్రాహ్మణులను కేవలం ఎన్నికల ప్రచారాలకూ, సాంప్రదాయక కార్యక్రమాలకే వాడుకుంటూ, చట్టసభల టిక్కెట్ల కేటాయింపులో పూర్తిగా విస్మరిస్తున్నాయి. ఫలితంగా, అసెంబ్లీలో వీరి సమస్యలపై గళమెత్తే నాథుడే కరువయ్యాడు.
సమాజం/వర్గం తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే బలమైన నాయకత్వం లేకపోవడంతో పాటు ఎన్నికల్లో ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ నిర్ణయాత్మక స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. అయితే, రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం ప్రధాన సమస్యగా మారింది.
వివిధ సంఘాలు, సంస్థలు విడివిడిగా పనిచేయడం వల్ల రాజకీయ ప్రభావం తగ్గడం, పార్టీలపై ఆధారపడటం, స్వతంత్ర రాజకీయ ఎజెండా లేకపోవడంతో ప్రధాన పార్టీల హామీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొత్త తరం రాజకీయంగా ముందుకు రాకపోవడం వల్ల నాయకత్వంలో ఖాళీ ఏర్పడటం, సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపే స్థాయిలో ముందుకు తీసుకెళ్లే వ్యవస్థ లేకపోవడం ప్రధాన లోపాలతో ఈ వర్గంలో రాజకీయ శూన్యత స్పష్టంగా ఏర్పడుతోంది.
శాశ్వత నిధులు కేటాయించాలి
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు ప్రతి ఏటా బడ్జెట్‌లో కనీసం రూ.500 కోట్లు కేటాయించి, నిరంతరాయంగా పథకాలు అమలు చేయాలని ఈ సామాజికవర్గం కోరుతున్నది. దేవాలయాల ఆదాయంతో సంబంధం లేకుండా అర్చకులందరికీ ప్రభుత్వ ట్రెజరీ ద్వారా నేరుగా నెలవారీ గౌరవ వేతనం అందించాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణ పారిశ్రామిక వినూత్న పథకం (బెస్ట్) కింద ఇచ్చే సబ్సిడీ రుణాల పరిమితిని పెంచి, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలి.
‘వివేకానంద ఓవర్సీస్ విద్యానిధి’ స్కాలర్‌షిప్‌లను పెంచి, అర్హులైన ప్రతి పేద బ్రాహ్మణ విద్యార్థికి సకాలంలో అందజేయాలి. నామినేటెడ్ పదవుల్లో, కార్పొరేషన్లలో, ఎమ్మెల్సీ కోటాలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలి. ‘దారిద్య్రానికి కులం లేదు, ఆకలికి వర్గం లేదు’ అనే వాస్తవాన్ని ఇకనైనా పాలకులు గుర్తించాలి.
కేవలం అగ్రవర్ణమనే ముద్ర చూసి పేదరికాన్ని నిర్లక్ష్యం చేయడం సామాజిక న్యాయం అనిపించుకోదు. నూతన కుల గణన గణాంకాల (0.9%) ఆధారంగానైనా, అత్యంత అట్టడుగున ఉన్న పేద బ్రాహ్మణులను గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.
వ్యాసకర్త: ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో ఇంచార్జ్, విజయక్రాంతి






