22-10-2025 01:12:41 AM
-అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో రేపు రెండో వన్డే
-తుదిజట్టుపై గంభీర్ తర్జన భర్జన
-తొలి వన్డేలో ఫైనల్ 11పై విమర్శలు
అడిలైడ్, అక్టోబర్ 21: ఆస్ట్రేలియా పర్యటనలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా తొలి వన్డేలో చిత్తుగా ఓడిపోయింది. బ్యాటర్ల వైఫల్యంతో ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో తుది జట్టు కూర్పుపైనా విమర్శలు వచ్చాయి. ఎక్కువ ఆల్ రౌండర్లపై ఫోకస్ పెట్టి స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా ఆడడం ఎంతవరకూ కరెక్ట్ అంటూ ప్రశ్నలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రెండో వన్డేకు తుది జట్టు ఎంపికపై కోచ్ గంభీర్,కెప్టెన్ గిల్ కసరత్తు చేస్తున్నారు.
స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్‌ను తీసుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యకాలంలో కుల్దీ ప్ రాణించినంత నిలకడగా మరో బౌలర్ రాణించలేదనే చెప్పాలి. ఫార్మాట్‌తో సంబం ధం లేకుండా టెస్టుల్లోనూ, టీ ట్వంటీల్లోనూ అదరగొట్టాడు.ఎంత నిలకడగా రాణిస్తున్నా చాలా సందర్భాల్లో కుల్దీప్ బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. ఈ విషయంలో కోచ్ గంభీ ర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాంబినేషన్ కోసం ఒక్కోసారి తప్పదు అంటూ గంభీర్ చెబుతున్నా మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మాత్రం అతని వ్యూహాన్ని తప్పుపడుతున్నారు. మ్యాచ్ విన్నర్‌ను అది కూడా ఫామ్‌లో ఉన్న బౌలర్‌ను ఎలా పక్కన పెడతారం టూ ప్రశ్నిస్తున్నారు. అయినప్పటకీ గంభీర్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
నిజానికి ఆస్ట్రేలి యా పిచ్‌లు పేసర్లకే అనుకూలంగా ఉంటాయన్నది అందరికీ తెలుసు. అలా అని తుది జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా ఏ టీమ్ కూడా ఆడదు. ఆసీస్ తుది జట్టునే తీసుకున్నా ఆల్‌రౌండర్లతో పాటు స్పిన్నర్ కున్నేమన్‌ను తీసుకుంది. ఇప్పుడు రెండో వన్డేకు జంపా అందుబాటులో వస్తాడు. అయితే గంభీర్ మాత్రం అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను బ్యాటింగ్‌లో డెప్త్ కోసం తీసుకుంటున్నాడు. అదే సమయంలో కుల్దీప్ యాదవ్ గత కొంతకాలంగా భారత్ జట్టులో ఎక్స్ ఫ్యాక్టర్ స్పిన్నర్‌గా అదరగొడుతున్న విషయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవడంలేదో అర్థం కావడం లేదంటూ పలువురు మాజీలు వ్యాఖ్యానిస్తున్నారు.
స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండాల్సిందే..
అడిలైడ్ పిచ్ కూడా దాదాపు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనాలున్నప్పటకీ తుది జట్టులో ఖచ్చితంగా ప్రధాన స్పిన్నర్ ఉండాల్సిందే. ఎందుకంటే పేసర్లు వికెట్లు తీయలేని సందర్భాల్లో స్పిన్నర్లే ప్రత్య్రర్థి జట్లను ఇబ్బందిపెట్టే పరిస్థితి ఉంటుంది. అంతేకాదు వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పే అవకాశాలనూ కొట్టిపారేయలేం. అడిలైడ్ లాంటి పిచ్‌లపై వాషింగ్టన్ సుందర్ లాంటి ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కంటే రిస్ట్ స్పిన్నరే బెటర్ అన్నది మాజీలు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో అడిలైడ్ వన్డేకు తుది జట్టులో కుల్దీప్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇదొక్కటే ఫైనల్ ఎలెవన్‌లో మార్పుగా కనిపిస్తోంది.
రెండో వన్డేకు భారత తుది జట్టు అంచనా: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, నితీశ్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్షదీప్ సింగ్