calender_icon.png 22 October, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకటే బెర్త్.. రేసులో 3 జట్లు

22-10-2025 01:11:04 AM

-మహిళల వన్డే ప్రపంచకప్

-భారత్ సెమీఫైనల్ లెక్కలివే

ముంబై, అక్టోబర్ 21: మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటికే మూడు సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. అంచనాలకు తగ్గట్టే రాణించిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలి యా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌లో అడుగుపెట్టాయి. ఇక మిగిలి ఉన్న ఒకే ఒక బెర్త్ కోసం మూడు జట్లు రేసులో నిలిచా యి. ఆతిథ్య భారత జట్టుతో పాటు శ్రీలంక, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. నిజానికి ఈ టోర్నీని ఘనంగా ఆరంభించిన భారత్ తర్వాత వరుసగా మూడు పరాజయాలతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

మూడు మ్యాచ్‌లూ గెలిచే అవకాశాల నుంచి ఓడిపోయినవే. దీంతో ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు 5 మ్యాచ్‌లలో రెండు గెలిచి, మూడింటిలో ఓడిపోయి 4 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గురువారం న్యూజిలాండ్‌తోనూ, ఆదివారం బంగ్లాదేశ్‌తోనూ తలపడనున్న భారత్ రెండింటిలోనూ గెలిస్తే నేరుగా సెమీఫైనల్‌కు క్వాలిఫై అవుతుంది.

ఒకవేళ రెండింటిలో ఒకటి ఓడి, మరొకటి గెలిచినా సెమీస్‌కు చేరే అవకాశముంది. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడా ల్సి ఉంటుంది. అప్పుడు రన్‌రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతానికి మెరుగైన రన్‌రేట్ ఉండడం భారత్‌కు ఊరటనిస్తోంది. ఇదిలా ఉంటే భారత్‌కు గట్టిపోటీనిస్తున్న న్యూజిలాండ్, శ్రీలంక జట్లు కూడా నాలుగేసి పాయింట్లతో ఉన్నప్పటకీ రన్‌రేట్ విషయంలో వెనుకబడ్డాయి.ఒకవేళ న్యూజిలాం డ్ తన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

ఇక బంగ్లాపై గెలిచిన శ్రీలంక చివరి మ్యాచ్‌లో పాక్‌ను ఓడిస్తే సెమీస్ రేసులో ఉంటుంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకున్నాయి.కాగా భారత్ గత మూడు మ్యాచ్‌లలోనూ కీలక బ్యాటర్ల వైఫల్యం... డెత్ ఓవర్స్‌లో పేలవ బౌలింగ్ కారణంగా పరాజయం పాలైంది. దీంతో చివరి రెండు మ్యాచ్‌లలోనూ దూకుడైన వ్యూహాలతో చెలరేగితే వేరే జట్లతో సంబంధం లేకుండా సెమీస్‌కు చేరుతుంది.