calender_icon.png 5 July, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌పై గులాబీ జెండా ఎగిరేనా?

05-07-2025 12:00:00 AM

  1. బైపోల్‌లో గెలిచేందుకు ‘కారు’ వ్యూహాలు
  2. సిట్టింగ్‌ను నిలుపుకునేందుకు విశ్వప్రయత్నం 
  3. డివిజన్ల వారీగా సమావేశాల నిర్వహణకు ప్రణాళికలు
  4. అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు, అభిప్రాయ సేకరణ

హైదరాబాద్, జూలై ౪ (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లో గెలుపు బీఆర్‌ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తో జూబ్లీహిల్స్ నియోజకర్గ ఉప ఎన్నిక త్వరలో జరుగనుంది. జూబ్లీహిల్స్ గులాబీ పార్టీకి సిట్టింగ్ స్థానం. తమ సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌కు ఉంది.

జూబ్ల్లీహిల్స్ నియోజకవర్గం అటు సంపన్నులు, ఇటు బస్తీలతో కలగలిపి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉన్నా యి. దానిలో ఎర్రగడ్డ, బోరబం డ, యూసు ఫ్ గూడ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, షేక్‌పేటలున్నాయి. ఈ నియోజకవర్గంలో 3,89,954 ఓటర్లున్నారు. ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నిక ల షెడ్యూల్ విడుదలైతే కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలైతుంది.

దీనితో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉంది.  నియోజకవర్గంలో 2,03,137 మంది పురుషులు ఓటర్లు, 1,86,793 మంది మహిళలు ఓటర్లున్నారు. కొత్త ఓటర్ల నమో దు తర్వాత ఈ సంఖ్యలో మార్పులుండవచ్చు. అయితే ప్రధానంగా 32శాతానికి పైగా ముస్లింలు ఉండటంతో విజయావకాశాలను వారు డిసైడ్ చేసే పరిస్థితులు ఉన్నాయి.

2014 ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ 41,656 ఓట్లు సాధిం చి రెండో స్థానంలో నిలిచారు. రాబో యే ఆర్నెల్లలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. డిసెంబర్‌లో బీహార్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. 

 టికెట్ ఎవరికీ?

ఇక అభ్యర్ధుల ఎంపిక కూడా కారు పార్టీకి కీలకం కానున్నది. దీని కోసం పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ, సర్వేలు కూడా నిర్వహించ నున్నట్లు సమాచారం. అయితే బీఆర్‌ఎస్ నుంచి ప్రధానంగా మాగంటి కుటుంబీకుల పేరు వినిపిస్తోంది. దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత మాగంటి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సానుభూతి, మూడు సార్లు ఎమ్మెల్యేగా మాగంటి ఎన్నిక కావడం, ఇటు బలమైన సామాజిక వర్గం వంటి అంశాలు కీలకం కానున్నాయి.

ఒకవేళ మాగంటి కుటుంబీకులు పోటీకి నిరాకరిస్తే ఎన్నికల బరిలోకి నిలబడడానికిదివంగత నేత పీజేఆర్ తనయుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. విష్ణువర్ధన్ రెడ్డి 2009 లో ఎమ్మెల్యేగా గెలిచారు. పీజేఆర్‌కు ఉన్న ఇమేజ్ విష్ణువర్ధన్ రెడ్డికి కలిసి వస్తుందని పలువురు  పేర్కొంటున్నారు. మరోవైపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.

ఎన్నో ఏళ్లుగా ఆయన అక్కడ స్థానిక రాజకీయాల్లో నేతగా ఉన్నారు. అయితే పెద్ద సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉండటంతో బీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధానంగా సానుభూతి, ప్రజల్లో మంచి పేరున్న నేత, గత ఎన్నికల్లో పనిచేసిన అంశాలు ప్రధాన భూమిక పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇద్దరు ఎమ్మెల్సీలకు బాధ్యతలు

అయితే జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటు కావడంతో బీఆర్‌ఎస్‌కు ప్రిస్టేజ్‌గా మారింది. ఈ బైపోల్‌లో ఇప్పటి నుంచే విజయం సాధించేందుకు కసరత్తులు మొదలు పెట్టింది. పార్టీ ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్ కుమార్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు ఇప్పటికే ఇన్‌ఛార్జీ బాధ్యతలు అప్పగించింది. వారిద్దరూ డివిజన్లలో సమావేశాలను నిర్వహించే కార్యాచరణలో ఉన్నారు.

దివంగత నేత మాగంటి గోపీనాథ్ సంతాప సభలను పార్టీ తరపున ఆరు డివిజన్లలో నిర్వహిస్తున్నారు. పార్టీని, క్యాడర్‌ను రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో వారు ఉన్నారు. ఇక షెడ్యూల్ విడుదల అయ్యే నాటికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో ముఖ్య నేత హరీశ్‌రావు కూడా ఎన్నికల బాధ్యతలు స్వీకరించి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి.

పార్టీకి సిట్టింగ్ స్థానం కావడం, ఉప ఎన్నికలో గెలపు ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు పంపాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇటు కాంగ్రెస్‌పై ప్రజావ్యతిరేకత ఉందని, రాబోయే బైపోల్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మరింత దూకడుగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. క్యాడర్, లీడర్లను కాపాడుకోవడం, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు జూబ్లీహిల్స్‌లో విజయం కారు పార్టీకి తప్పనిసరిగా మారింది.