23-01-2026 11:54:55 AM
ఉదయమే తెరుచుకున్న వైన్ షాపులు
రాష్ట్రం మొత్తం ఒకే నిబంధన ఉండాలన్న మందుబాబులు
సంస్థాన్ నారాయణపూర్,జనవరి 23 (విజయ క్రాంతి): మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తెరవాలని,సిట్టింగ్ సాయంత్రం 6 గంటల తర్వాత మొదలు పెట్టాలని సూచించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిబంధనలు అమలు కావడం లేదు. గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు వైన్ షాపులను మూసివేసి మధ్యాహ్నం తర్వాతనే తెరవాలని సూచించారు. వైన్స్ సిబ్బంది అభ్యంతరం చెప్పినప్పటికీ బలవంతంగా మూసివేయించారు.రాజగోపాల్ రెడ్డి ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందే అని తేల్చి చెప్పారు.
కానీ శుక్రవారం ఎక్సైజ్ అధికారులు ఉదయమే వైన్స్ షాపులను,సిట్టింగులను తెరిపించారు.తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని మధ్యాహ్నం తర్వాత తెరవాలనే నిబంధన తమకు రాలేదని రాష్ట్రం మొత్తం ఒకే పాలసీ అమలులో ఉందని తెలిపారు.బలవంతంగా ఎవరైనా మద్యం షాపులను మూసివేయిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఒకే నిబంధన ఉండాలని మునుగోడు నియోజకవర్గానికి మాత్రమే ప్రత్యేక నిబంధనలు సరికాదని మద్యం ప్రియులు తెలిపారు.