8 March, 2026 | 6:02 AM

చమురుకు రెక్కలు!

04-03-2026 12:00 AM

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుండడం, ప్రతిగా ఇరాన్ కూడా ధీటుగా స్పందిస్తుండడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా తయారవుతున్నాయి. తాజాగా ఇరాన్ చమురు రవాణా సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మార్గాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించింది. హర్మూజ్ ప్రాంతంలో నౌకలు దాటేందుకు ప్రయ త్నిస్తే నిప్పు పెడతామంటూ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో చము రు సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తున్నది. ఇరాన్‌లోని హర్మూజ్ జలసంధి అనేది ప్రపంచ ఇంధన రవాణాకు కీలక మార్గంగా ఉంది. ఈ మార్గం నుంచే ప్రపంచ చమురులో దాదాపు 20 శాతం రవాణా అవుతున్నది. ఇక చమురు దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌కు హర్మూజ్ ప్రాంతం నుంచే దాదాపు 50 శాతం చమురు దిగుమతి చేసుకుంటున్నది. ఇలాంటి కీలకమైన జలసంధిని మూసేయడం వల్ల రవాణా, బీమా ఖర్చులు భారమవుతాయి.

దీంతో చమురు ధరలు అమాంతం పెరిగిపోతాయి. యుద్ధం ప్రభా వంతో మంగళవారం నాటికి ముడి చమురు ధర బ్యారెల్‌కు 80 డాలర్లు దాటేసింది. పశ్చిమాసియాలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటే అవకాశం ఉందని బార్‌క్లేస్ బ్యాంక్ పేర్కొంది. గతంలో రష్యా యుద్ధం సమయంలో చమురు ధర 120 డాలర్లు దాటినప్పటికీ మళ్లీ వెనక్కి వచ్చాయి. 2008లో అఫ్గానిస్తాన్ ఇరాక్ అమెరికా యుద్ధాల సమయంలోనూ చమురు బ్యారెల్ ధర 128 డాలర్లకు పెరిగిన దాఖలాలున్నాయి.

మధ్యప్రాచ్యంలో రాజకీయ అస్థిరత, యుద్ధాలు జరిగినప్పుడల్లా  చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే చమురు ధరల హెచ్చుతగ్గులకు ప్రకృతీ వైపరీత్యాలు కూడా మరో కారణం. తుఫాన్లు, వరదలు సంభవించినప్పుడు కూడా చమురు ధరలు ఆకాశాన్నంటిన సందర్భాలున్నాయి. ముడి చమురు ధరల పెరుగదల ప్రభావం అంతర్జాతీయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్)లోని సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్‌లు తమ ముడి చమురులో ఎక్కువ భాగాన్ని హర్మూజ్ జలసంధి ద్వారానే ప్రపంచానికి రవాణా చేస్తాయి.

ఇందులో ఎక్కువ ముడి చమురు ఆసియాకు సరఫరా అవుతుంది. హర్మూజ్ జలసంధిని మూసేయడం ద్వా రా ఆసియా దేశాలపైనే మొదటి ప్రభావం పడనుంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 88 శాతానికి పైగా దిగుమతి పైనే ఆధారపడుతుంది. ఆ దిగుమతుల్లో దాదాపు 50 శాతం, రోజుకు సుమారు 2.5 నుంచి 2.7 మిలియన్ బ్యారెల్స్, హోర్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతాయి.

ముడి చమురు ధరల్లో ప్రతీ డాలర్ పెరుగుదలకు భారత ప్రభుత్వంపై రూ.13 వేల కోట్ల భార పడుతుంది. అయితే భారత్‌లో 70 రోజులకు సరిపడా చము రు నిల్వలు, సహజవాయువులు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. చమురు, సహజవాయువు విషయంలో ఆందోళన అవసరం లేదని కేంద్రం చెబుతున్నప్ప టికీ, యుద్ధం ఎన్ని రోజులు సాగుతుందనే దానిపై సందిగ్ధత నెలకొనడంతో 2022 నుంచి భారత్‌లో స్థిరంగా ఉన్న చమురు ధరలు పెరిగే అవకాశముంది.

పైగా అమెరికా ఆంక్షల వల్ల రష్యా నుంచి ఎంతమేర చమురు కొనుగోలు చేస్తున్నామనే దానిపై స్పష్టత లేదు. పంతాలకు పోయి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ప్రత్యక్ష యుద్ధంలో మునిగిపోగా, చమురు సంక్షోభంతో ఇంధన ధరలకు రెక్కలొచ్చి పరోక్షంగా ప్రపంచ దేశాలు కూడా నలిగిపోయే అవకాశముంది.