మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
- ఆసుపత్రికి తీసుకెళుతుండగా కారు ప్రమాదం
- ఆలస్యమవడంతో మృతి చెందిందన్న వైద్యులు
నిర్మల్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మాసాయిపేట గ్రామ సర్పంచ్ దుర్గం లహరిక(35) ను మృత్యువు వెంటాడింది. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన లహరిక గ్రామా భివృద్ధికి కృషి చేస్తూ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే శుక్రవారం సొంత ఇంటిలో గుర్తుతెలియని పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయ త్నం చేసింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న లహరికను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే కారులో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, వేగంగా వెళుతున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. సర్పంచ్ లహరికను ఆసుపత్రికి తరలించేందుకు 10 నిమిషాలు సమయం వృధా అయ్యింది. అనంతరం వేరే కారు తెప్పించి ఖానాపూర్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మాసాయిపేట గ్రామం, సర్పంచ్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.




