calender_icon.png 29 December, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చిన మహిళకు మెరుగైన వైద్యం

29-12-2025 03:58:12 PM

చాకచక్యంగా వ్యవహరించిన జనరల్ ఆస్పత్రి వైద్యులపై ప్రశంసలు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తీవ్ర అస్వస్థతకు గురైన ఓ మహిళకు చికిత్సలు జరిపి బ్రెయిన్ స్టాక్ వచ్చినట్లుగా గుర్తించిన జనరల్ ఆస్పత్రి వైద్యులు చాకచక్యంగా వ్యవహరించి వెంటనే సూదిమందు ఇవ్వడంతో ఆ మహిళ సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో సరైన సమయంలో స్పందించిన జనరల్ ఆస్పత్రి వైద్యులపై జిల్లా వాసులు, మేధావులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలానికి చెందిన పార్వతమ్మ (45)కు ఆదివారం రాత్రి అకస్మాత్తుగా ఎడమ చేతి లాగడం, మూతి వంకర, ఎడమ కాలు అచేతనంగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.

ఎమర్జెన్సీ విభాగం వైద్యులు తక్షణమే స్పందించి చికిత్స ప్రారంభించారు. సీటీ స్కాన్ నిర్వహించగా బ్రెయిన్ స్ట్రోక్‌గా నిర్ధారణ అయింది. అత్యంత ఖరీదైన ప్రత్యేక ఇంజెక్షన్‌ను సకాలంలో అందించడంతో మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. అనంతరం పార్వతమ్మను ఆబ్జర్వేషన్‌లో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సకాలంలో చికిత్స అందించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శంకర్‌ను పలువురు అభినందించారు. అలాగే డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ డా. శకుంతలను డిప్యూటీ సూపరిండెంట్ డా. వి. శేఖర్ అభినందించారు.