calender_icon.png 29 December, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయోలా ప్రైవేట్ పాఠశాలలో అక్రమాలు

29-12-2025 04:26:59 PM

విద్యార్థుల భద్రత ప్రమాదంలో ఉందంటూ ఏబీవీపీ ఆందోళన

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండల కేంద్రంలోని లయోలా ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న అక్రమాల వల్ల విద్యార్థుల చదువు, భద్రత, మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని ఏబీవీపీ చిట్యాల నాయకులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కొంపల్లి సూర్య, విద్యార్థి నాయకులు మాట్లాడుతూ... పాఠశాలలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, తల్లిదండ్రులపై ఒత్తిడి,  ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను మానసికంగా వేధించడం, తరగతుల నుంచి బయటకు పంపడం పాఠశాలలో భద్రత, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు దారుణ స్థితిలో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పూర్తిగా పాటించకపోవడం అత్యంత ఆందోళనకరంగా పాఠశాల పరిసరాలలో మద్యం బాటిల్లు కుప్పలు కుప్పలుగా ఉండడం, ముఖ్యంగా విద్యార్థులపై మాటలతో వేధింపులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయి.

ఈ పరిస్థితుల వల్ల విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతూ, పాఠశాలకు రావడానికే ఇబ్బంది పడుతున్నారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఈ విషయంపై మండల విద్యాధికారి ( ఎంఈఓ) వెంటనే స్పందించి, లయోలా ప్రైవేట్ పాఠశాలపై తక్షణ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అవసరమైతే విద్యార్థుల భద్రత కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.