మహిళా సంఘాలే మాదకద్రవ్య రహిత సమాజానికి సంఘమిత్రలు: సీపీ శ్వేత
జనగామ, ఆగస్టు 26 (విజయక్రాంతి) : జనగామ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాలు ముందుకు రావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘సంఘమిత్ర - మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు‘ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లతో కలిసి సీపీ శ్వేత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ మాదకద్రవ్యాలు ఎక్కడ విక్రయించినా, రవాణా చేసినా వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ 1.25 లక్షల మంది మహిళా సంఘాల సభ్యుల ద్వారా ప్రతి ఇంటికి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






