మహిళా సంఘాలు వ్యవసాయ రంగంలో ముఖ్య పాత్ర పోషించాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, మార్చి 17 (విజయక్రాంతి): మహిళా సంఘాలు వ్యవసాయ రంగంలో ముఖ్య పాత్ర వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మార్క్ ఫెడ్ ప్రతినిధులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొక్కజొన్న సాగు, కొనుగోళ్లు విస్తృతమైనందున వాటికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలకు వరి ధాన్యం కొనుగోలులో అనుభవం ఉన్నందున వారికి ప్రాధాన్యతనిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
దీని కోసం అవసరమైన ఏర్పాట్లు చేసి ఆసక్తి గల సంఘాలను గుర్తించి వెంటనే నివేదిక తయారు చేయాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు మాత్రమే కాకుండా ఇతర స్వయం సహాయక సంఘాలకు కూడా ప్రాధాన్యత కల్పించి, ప్రోత్సహించాలన్నారు. అదే విధంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా జిల్లాకు కేటాయించిన డ్రోన్లను మహిళా సంఘాల ద్వారా ఇస్తే రైతులకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
అలాగే రాబోయే రోజుల్లో ఎరువుల కొరత లేకుండా గ్రామస్థాయిలో రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సులభంగా, కాలానుగుణంగా అందించడానికి మహిళా సంఘాలు ముందుకు రావాలని ఆకాంక్షించారు.దీనికి గాను జిల్లాలోని అన్ని క్లస్టర్లలో మహిళా సంఘాలచే ఎరువుల దుకాణాలను ప్రారంభించేందుకు తక్షణమే తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత, ఏడిఏలు, అడిషనల్ పీడీలు, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




