calender_icon.png 1 August, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుస్నాబాద్‌లో మహిళా శక్తి ప్రదర్శన

31-07-2025 12:00:00 AM

100 రోజుల ప్రణాళికలో స్వయం ఉపాధి ఉత్పత్తుల ఫెస్టివల్

రూ.2 కోట్లతో 23 సంఘాలకు ఆర్థిక చేయూత

హుస్నాబాద్, జూలై 30 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 100 రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం మున్సిపల్ ఆఫీసు వద్ద మహిళా శక్తి ప్రదర్శన నిర్వహించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో జరిగిన ఈ  ఫెస్టివల్లో మహిళా సంఘాల సభ్యులు తమ చేతులతో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను, వారు నిర్వహిస్తున్న వృత్తులు, వ్యాపారాలను ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనతో పాటు అమ్మకాలు కూడా విజయవంతంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ, మహిళా సంఘాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు.

ఇందిరా మహిళా శక్తి, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ఇతర రుణాల ద్వారా స్వయం ఉపాధిని పెంపొందించడానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. హుస్నాబాద్ లో మొత్తం 503 మహిళా సంఘాలు ఉన్నాయని, ఈ సంవత్సరం ఇప్పటివరకు 23 సంఘాలకు రూ.2 కోట్ల  రుణాన్ని మంజూరు చేసినట్టు తెలిపారు.

 ఉత్పత్తుల ప్రదర్శనలో వైవిధ్యం, ఆనందం

 ఫెస్టివల్లో ప్రదర్శించిన ఉత్పత్తులు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రుచికరమైన తినుబండారాలు, పిండివంటలు, పర్యావరణ హితమైన మొక్కజొన్న పిండితో తయారు చేసిన స్వీట్లు, కప్పులు, ప్లేట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వీటితో పాటు తాజా కూరగాయలు, గాజులు, బట్టలు, ప్రెస్ మెటీరియల్స్  ఇతర గృహోపకరణాలు కూడా ఉన్నాయి. ఈ ఫెస్టివల్  ఆనందదాయక వాతావరణంలో జరిగింది, మహిళా సభ్యుల ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో ఏడీఎంసీ సంతోషిమాత మేనేజర్ సంపత్, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, ఓబీలు పాల్గొన్నారు.