2 July, 2026 | 3:13 AM

అన్ని శాఖల సమన్వయంతో పని చేయాలి

02-07-2026 02:07 AM

డీసీపీ భాస్కర్

మంచిర్యాల క్రైమ్, జూలై 1 : చిన్నారుల రక్షణ కోసం అన్ని శాఖల సమన్వయంతో పోలీసులు పని చేసి ఆపరేషన్ ముస్కాన్ ను విజయవంతం చేయాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ కోరారు. ఈ నెల 31 వరకు నిర్వహించనున్న ‘ఆపరేషన్ ముస్కాన్12’పై బుధ వారం డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమిక్షా సమావేశంలో డీసీపీ మాట్లాడారు.

జిల్లాలో తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం, బాల కార్మికులను పనుల నుంచి విముక్తులను చేయడం, వారికి అవసరమైన సంరక్షణ, పునరావాసం కల్పించి తిరిగి సమాజంలో కలిసేలా చేయడమే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన లక్ష్యమన్నారు. గల్లంతైన చిన్నారుల ఆచూకీ కోసం సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టాలని, బాలల దోపిడీకి పాల్పడుతున్న వ్యక్తులను, బాల కార్మికులను పనిలో పెట్టుకునే యజమానులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్లు (ఎస్ జే పీ యూ),యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు (ఏ హెచ్ టీ యూ), ఆపరేషన్ ముస్కాన్ బృందాలు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, బాలల సంక్షేమ కమిటీలు, బాలల సంరక్షణ సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో పోలీసు శాఖ, శిశు సంక్షేమ శాఖ, నేషనల్ చైల్ లేబర్ ప్రాజెక్ట్ (ఎన్సీఎల్పీ)తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.