నాటిన మొక్కలు సంరక్షించాలి
డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
ముకరంపుర, జూన్ 5(విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు తల్లి పేరు మీద ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లోని 42వ డివిజన్ భగత్ నగర్ లో జిల్లా పరిషత్ హెడ్ కోటర్స్ లో గల పార్కులో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటడం మరియు నాటిన మొక్కలను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
చెట్లు పెట్టే బాధ్యత కేవలం నగరపాలక సంస్థ లేదా ప్రభుత్వ సంస్థలది మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి పెంచాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమంలో మరొక ముఖ్యమైన ఘట్టం చోటుచేసుకుంది. వాసవి క్లబ్, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను విడనాడి, పర్యావరణ అనుకూలమైన జూట్ బ్యాగులను వాడాలని ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ ప్రజలు,మహిళలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు .






