భద్రకాళి అమ్మవారికి లక్ష గులాబీ పుష్పార్చన
వరంగల్, మార్చి 27 (విజయక్రాంతి): చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళీ దేవస్థానంలో వసంత నవరాత్ర మహోత్సవములు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. తొమ్మిదవ రోజు కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం జరుపడిన పిమ్మట కల్పోక్త ప్రకారం వసంత నవరాత్ర ఉత్సవాల సందర్భంగా జరుపవలసిన విశేష జపహూమార్చనాభిషేకములు నిర్వహించారు.
అనంతరం అమ్మవారికి గులాబీ పూలతో లక్షపుష్పార్చన జరిపి అమ్మవారికి నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. ఈ రోజు అమ్మవారికి జరుపబడిన లక్షపుష్పార్చన ఉభయదాతలు వరంగల్ పశ్చిమ నియోజక వర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి-నీలిమ దంపతుల సౌజన్యంతో నిర్వహింపబడింది. ఆలయానికి విచ్చేసిన ఎం.ఎల్.ఏ రాజేందర్ రెడ్డికి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు గాండ్ల స్రవంతి, పాలడుగుల ఆంజనేయులు, ప్రధానార్చకులు భద్రకాళి శేషులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. భద్రకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన ఎం.ఎల్.సి కి ఆలయ ధర్మకర్తలు ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, జారతి వెంకటేశ్వర్లు, తొగరు క్రాంతి, మూగా శ్రీనివాసరావులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజానంతరం మహామండపంలో ఎం.ఎల్.సి శ్రీనివాస రెడ్డికి మహదాశీర్వచనం నిర్వహించారు. ఆలయంలో ఎండ తాకిడికి భక్తుల ఇబ్బందిని గమనించిన శ్రీనివాస్ రెడ్డి వెంటనే శాశ్వత ప్రాతిపదికన జర్మన్ పెండల్స్ టెంట్లు వేయించమని అందుకు అయ్యే ఖర్చు పదిలక్షల రూపాయలు తమ విరాళంతో జరిపించమని ధర్మకర్తలను కోరారు. ధర్మకర్తలు 10 రోజులలో పని పూర్తి చేయించగలమని శ్రీనివాసరెడ్డికి హామి ఇచ్చారు.




