calender_icon.png 6 July, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏళ్లనాటి చరిత్ర.. ఏలేశ్వరం కొండ!

06-07-2025 12:50:46 AM

  1. నాగార్జునకొండకు సమీపంలో అద్భుత చారిత్రక ప్రదేశం
  2. ఎందరో రాజులు కొలిచిన కాత్యాయనీ సహిత మల్లికార్జునస్వామి ఆలయం
  3. సాగర్ నిర్మాణానికి ముందు నిత్యపూజలు
  4. నేటి పాలకుల నిర్లక్ష్యంతో భక్తులకు దర్శనభాగ్యం కరువు
  5. తవ్వకాల్లో లభించిన లెక్కలేనన్ని చారిత్రక శాసనాలు, దేవతామూర్తుల విగ్రహాలు
  6. రాచరికపు ఆనవాళ్లకు ప్రత్యక్షసాక్షిగా నిలుస్తున్న ఏలేశ్వరం కొండ

బాదిని నర్సింహ, నల్లగొండ (విజయక్రాంతి): అది నాగార్జునకొండకు సమీప ప్రాంతం.. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం.. ఎటూ చూసినా పచ్చదనం.. కనువిందు చేసే జలపాతాలు.. ప్రకృతి అందాల నడుమ ఒంటరిగా ఉంటుందా ఆ కొండ. రాచరికపు ఆనవాళ్లకు ప్రత్యక్ష సాక్షిగా.. ఘన చరిత్రకు నిలువెత్తు రూపంగా నిలిచింది ఏలేశ్వరం కొండ. నాగార్జునసాగర్ ప్రాజెక్టు మధ్యలో నాగార్జునకొండకు సమీపంలో ఏకైక కొండ ఏలేశ్వరం.

ఈ కొండపై కొలువైన మల్లన్నను దర్శించుకోవడం ఓ మరి చిపోలేని అనుభూతి. వేల ఏండ్ల క్రితమే ఏలేశ్వరం కొండ దక్షిణ కాశీగా గుర్తింపు దక్కిం చుకుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ముందు వరకు నిత్యపూజలు అందు కున్న ఏలేశ్వరం మల్లన్న కొండ..

ప్రాజెక్టు నిర్మాణంతో ఒంటరిగా మిగిలిపోయింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు ముందు చేపట్టిన తవ్వకాల్లో ఏలేశ్వరం వద్ద లభించిన చారిత్రక శాసనాలు, లెక్కలేనన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఇప్పటికీ పురావస్తు శాఖ మ్యూజియాల్లో కుప్పలు తెప్పలు గా ఏ దిక్కూ లేకుండా పడి ఉన్నా యి. ఏళ్లనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోయాయి.

ఘనచరిత్రకు సజీవ సాక్ష్యం..

ఓవైపు నల్లమల అటవీ అందాలు.. మరోవైపు నాగార్జునసాగర్ జలాల హోయల మధ్య ఏలేశ్వరం కొండ ఘనచరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కొండపైన కొలువైన అత్యంత అరుదైన కాత్యాయనీ సహిత మల్లికార్జునస్వామి ఆలయాలు కొలువై అప్పట్లో భక్తులకు కొంగుబంగారంగా నిలిచేవి. చారిత్రక పూర్వయుగం నుంచి శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, పశ్చిమ చాళుక్యులు, కాకతీయుల వరకు ఘనమైన రాజ్యా ల రాచరికపు ఆనవాళ్లకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన గుట్ట అది. కానీ నేడు పాలకుల నిర్లక్ష్యపు మూలంగా సాగరం మధ్యలో ఒంటరి గా మిగిలింది.

శాతవాహనుల కాలంలో నాగార్జునుడి బౌద్ధ విశ్వవిద్యాలయంతో శ్రీపర్వతంగా.. ఇక్ష్వాకుల పరిపాలన నగరం విజయపురిగా.. ఎన్నో ఆనవాళ్లు తన సన్నిధిలోనే నిక్షిప్తం చేసుకున్న ప్రముఖ ప్రాంత మైన ఏలేశ్వరం మల్లన్న ఇన్నాళ్లూ.. ఏలిన వారి చిన్నచూపుతో దర్శనానికే దూరమయ్యాడు. ముక్కోటి దేవతల విగ్రహాలు చెక్కి న కోటొక్క శిలలు ఉన్నట్లుగా ప్రతీతి పొంది న అలనాటి చారిత్రక ఏలేశ్వరానికి సజీవ సాక్ష్యంగా మిగిలిన ఏలేశ్వరం కొండను దర్శించుకోవడం భాగ్యమే అయ్యింది.

తవ్వకాల్లో విస్తుపోయే నిజాలు..

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా.. ముంపు పరిధిలో ఉన్న నల్లగొండ జిల్లా దేవరకొండ తాలూకాలోని ఏలే శ్వరంలో పురావస్తుశాఖ 1962లో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టింది. అప్పటికే అక్క డ ఎన్నో చారిత్రకమైన ఆనవాళ్లు లభించడంతో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి తవ్వకాలు చేపట్టారు. చారిత్రక పూర్వయు ం నుంచి క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు అనేక కాలాలు, రాజుల పాలనకు అద్దంపట్టే ఆనవాళ్లు ఇక్కడ లభించాయి.

క్రీస్తు శకం 1వ శతాబ్దం శాతవాహనుల కాలంలో వాడిన అనేక రకాల పూసలు, గాజులు, టెర్రాకోట రకానికి చెందిన స్త్రీ, పురుష ప్రతిమలు పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇక్కడ లభించిన పూసల్లో చెర్ట్, ఎగేట్, లాసి ట్ లాజిలీ, కార్నేలియన్ వంటి అనేక రకాలకు చెందినవి ఉన్నాయి. ఆ కాలం నాటి వివిధ రకాల ఆటబొమ్మలు సైతం ఏలేశ్వరం తవ్వకాల్లో లభించగా..

అవన్నీ ఇప్పటికీ నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్లు సహా హైదరాబాద్, సాగర్ మ్యూజియాల్లోనూ భద్రంగా ఉన్నాయి. 3, 4 శతాబ్దాల కాలం లో పరిపాలన చేపట్టిన ఇక్ష్వాకులు విజయపురిని రాజధానిగా చేసుకుని పరిపాలిం చిన సంగతి తెలిసిందే. ఈ విజయపురితోపాటు అంతకుముందే శ్రీపర్వతంపై శాతవాహనుల కాలంలో నాగార్జునుడు స్థాపించిన బౌద్ధ విశ్వవిద్యాలయం సైతం ఏలేశ్వరానికి అతి సమీపంలోనే ఉండేవి.

ఇందుకు సం బంధించిన ఆనవాళ్లతోపాటు.. వేలాది రకా ల నాపరాతి దేవతా విగ్రహాలు ఇక్కడ లభించాయి. కాకతీయుల కాలంలో గణపతిదే వుడి వంటి ఎందరో రాజులు ఏలేశ్వర దేవా లయం గురించి వేయించిన శాసనాలు సై తం ఇక్కడి తవ్వకాల్లోనే వెలుగు చూశాయి. విష్ణుకుండినులు, పశ్చిమ చాళుక్యులు, చోళు ల కాలానికి చెందిన శాసనాలు సైతం లభించాయి. పురావస్తు శాఖ రికార్డుల్లోనూ అవి భద్రపరచబడ్డాయి. నల్లగొండ జిల్లాలోనే అత్యధికంగా చారిత్రక ఆనవాళ్లు వెలుగు చూసిన ప్రాంతంగా ఖ్యాతిగాంచింది.

రావణబ్రహ్మ సోదరి ఏలె తపస్సుతో..

త్రేతాయుగంలో రావణబ్రహ్మ సోదరి అయిన ఏలె తపస్సుకు ఈ గుట్టపై ఈశ్వరుడు ప్రత్యక్షమైనందునే.. ఏలేశ్వరం అనే పేరు వచ్చినట్లు ప్రచారంలో ఉంది. తమిళనాడులో రామేశ్వరం తరహాలో అరుదైన కాత్యాయనీదేవి సహిత మల్లికార్జునుడిగా ఇక్కడ ఈశ్వరుడు వెలిసినట్లు చెప్పుకుంటారు. ఇప్పటికీ గుట్టపైన ఉన్న దిగువవ కాత్యాయనీదేవి ఆలయం, ఎగువన మల్లికార్జునుడి ఆలయాలు కాకతీయుల కాలంలో ఘనమైన పూజలు అందుకున్నట్లు ఏలేశ్వరంలో లభించిన అనేక శాసనాలు చెప్తున్నా యి.

గణపతి దేవుడు సహా ఎందరో రాజులు ఇక్కడికి సమీపంలోని గ్రామాలకు గ్రామాలనే ఏలేశ్వర దేవుడికి పూజల నిమిత్తం ధా రాదత్తం చేసినట్లు పలు శాసనాల్లో పేర్కొని ఉంది. ఏలేశ్వరం గుట్టపై ముక్కోటి దేవతల విగ్రహాలు చెక్కిన కోటొక్క శిలలు ఉండేవని చెప్తుంటారు. పురావస్తు శాఖ తవ్వకాల్లో లభించిన వేలాది విగ్రహాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శ్రీశైలానికి సరైన రహదారి మార్గం లేక..

అక్కడికి వెళ్లలేని ఎక్కువ మంది భక్తులు ఏలేశ్వరం సందర్శించేవారని.. అప్పట్లోనే దక్షిణ కాశీగా ఏలేశ్వరం ప్రసిద్ధి చెందిందని ముంపు గ్రామాల ప్రజలు నేటికీ చెప్పుకుంటుంటారు. ఇప్పటికీ మూల విరాట్ విగ్రహాలు ఏలేశ్వరం గుట్టపై ఉన్న ఆలయాల్లోనే ఉండగా..

ముంపు తర్వాత నాగార్జునసాగర్ హిల్కాలనీలోని సత్యనారాయణస్వామి గుడిపక్కన ఏలేశ్వరం మాధవస్వామి, కాత్యాయ నీ దేవి ఆలయం నిర్మించారు. 1962 తర్వాత ఇక్కడి ఆలయాల్లో అన్ని పూజలు ఆగిపోగా.. ముంపు నిర్వాసిత గ్రామాలకు చెందిన కొందరు ఆసక్తితో 2006 నుంచి మళ్లీ ఇక్కడ వార్షిక ఉత్సవాలు చేపడుతుండడం గమనార్హం.

సాగరం మాటున ఏలేశ్వరం కొండ..

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినిగా ఈ ప్రాజెక్టును చెప్పొచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ప్రాజెక్టు నీటిమాటున ఘనమైన చరిత్ర కలిగిన ఏలేశ్వరం కొండ కనుమరుగు అవుతోంది.

నిజానికి ఈ ప్రాజెక్టు మధ్యలోనే అలనాటి బౌద్ధ విశ్వవిద్యాలయం ఆనవాళ్లు బయటపడిన సంగతి తెలిసిందే. కానీ సాగర్ ఆనకట్టకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాత్యాయనీ సహిత మల్లికార్జునస్వామి వార్ల ఆలయాలతో కూడిన ఏలేశ్వరం మల్లన్న గుట్ట మాత్రం ఆదరణకు నోచుకోవడం లేదు.