4 July, 2026 | 12:58 AM

ఎల్లమ్మ కథ.. చిందుల నేపథ్యంలో..

04-07-2026 12:00 AM

‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న క్రేజీ మూవీ ‘ఎల్లమ్మ’. ఈ సినిమాతో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్నారు. టైటిల్ గ్లింప్స్, టీజర్‌తోనే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేసిన ఈ సినిమాను సంక్రాంతి విడుదల లక్ష్యంగా మేకర్స్ ప్రస్త్తుతం చిత్రీకరణ పనులను పరుగులు పెట్టిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాను నెలకు 10 రోజుల పాటు కాల్షీట్లు ఇస్తూ చిత్రీకరణలో పాల్గొంటున్నానని, ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తయిందని డీఎస్‌పీనే స్వయంగా వెల్లడించారు. ఆయన ఇందులో హీరో డప్పు కళాకారుడు ‘పర్షి’ పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ పాత్రకు సాయిపల్లవి, కీర్తి సురేశ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో వడ్డే నవీన్‌ను ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలావుంటే, ఈ సినిమా కథ లీక్ అయిందంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎల్లమ్మను కొలిచే చిందు యక్షగానం కళాకారుల కుటుంబ నేపథ్యంలో ఈ గ్రామీణ డ్రామా తెరకెక్కుతోందని సమాచారం.

ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మను ఆరాధించే కళాకారుల జీవితాలు, వారి కలలు, గ్రామీణ వాతావరణం, భావోద్వేగాలు ఈ చిత్రంలో ప్రధానంగా ఉండనున్నాయి. తల్లి సెంటిమెంట్‌తో పాటు హీరోహీరోయిన్ల మధ్య స్వచ్ఛమైన ప్రేమకథ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాలోని సంభాషణలన్నీ తెలంగాణ యాసలో ఉండనున్నాయి. ఈ క్రమంలో మరి కథానాయకుడు దేవిశ్రీప్రసాద్ మాండలికం పలుకడంలో ఎంతవరకు న్యాయం చేస్తారనే విషయమై ఆసక్తి నెలకొంది.