యెస్ బ్యాంక్ ఫలితాలు అదుర్స్

28-04-2024 01:56:43 AM

123 శాతం పెరిగిన నికరలాభం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ప్రైవేటు రంగ యెస్ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు అదరగొట్టాయి. అనలిస్టుల అంచనాలను బ్యాంక్ పెద్ద మార్జిన్‌తో అధిగమించింది. మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికరలాభం 2023 మార్చి క్వార్టర్‌తో పోలిస్తే భారీగా 123 శాతం వృద్ధిచెంది రూ.202 కోట్ల నుంచి రూ452 కోట్లకు చేరింది. 2023 డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే నికరలాభం 95.2 శాతం పెరిగింది. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్లు స్థిరంగా 2.4 శాతం వద్ద ఉన్నాయి. భారీస్థాయిలో వడ్డీయేతర ఆదాయం జోరుగా పెరగడంతో బ్యాంక్ మెరుగైన ఫలితాల్ని సాధించగలిగింది. వడ్డీయేతర ఆదాయం ఏడాది క్రితంకంటే 56.3 శాతం వృద్ధిచెందగా, క్యూ3కంటే 31.3 శాతం పెరిగింది. క్యూ4లో షేర్‌హోల్డర్లకు రిటర్న్ ఆన్ అసెట్స్‌ను 0.5 శాతం మేర పెంచగలిగామని యెస్ బ్యాంక్ సీఈవో, ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. గత 8 త్రైమాసికాల్లో ఎన్నడూ లేనంతగా మార్చి క్వార్టర్లో డిపాజిట్లు 20 శాతం పెరిగాయని, కాసా రేషియో 10బేసిస్ పా యింట్లు మెరుగుపడి 30.9 శాతానికి చేరినట్టు వివరించారు.