బంగారం ఎన్నేండ్లకు రూ.2 లక్షలు అయితది?

28-04-2024 01:54:31 AM


బంగారం ఎన్నేండ్లకు రూ.2 లక్షలు అయితది?

ఆరేండ్లా? తొమ్మిదా? పద్దెనిమిదా?

మనదేశంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలకు జీవితాంతం అత్యంత ప్రియమైన ఆస్తి బంగారమే అంటే అతిశయోక్తి కాదు. ఇతర ఆస్తులతో పోలిస్తే ఆకర్షణీయమైన రాబడులు తెచ్చిపెట్టేదీ పుత్తడే.  ఈ ఆస్తి తులం 24 క్యారెట్ల ధర ఇటీవలే (2024 ఏప్రిల్ 18)  రూ.74,000 చరిత్రాత్మక రికార్డుస్థాయిని అందుకున్నది.  రిజర్వ్‌బ్యాంక్ తన సావరిన్ గోల్డ్ బాండ్ల ధరను నిర్ణయించేందుకు ప్రామాణికంగా పరిగణించే ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) డేటా ప్రకారం 2015లో 10 గ్రాముల పూర్తి స్వచ్ఛత కలిగిన పసిడి ధర రూ.24,740. అంటే బంగారం ధర అప్పటి నుంచి దాదాపు మూడు రెట్లు పెరిగి ఇప్పటిస్థాయిని చేరడానికి తొమ్మిదేండ్లు పట్టింది.

అంతకుముందు కూడా 2006లో రూ.8,250గా ఉన్న ధర మూడు రెట్లు అయ్యేందుకు తీసుకున్న సమయం తొమ్మిదేండ్లే. కానీ 2006కంటే ముందు ధర 300 శాతం పెరగడానికి దాదాపు 19 ఏండ్ల సమయం పట్టింది. 1987లో 10 గ్రాముల పసిడి ధర రూ.2,570కాగా, 2006కల్లా ఇది మూడు రెట్లకు కాస్త అధికంగా పెరిగింది. అంతక్రితం ధరలసైకిల్‌లో ఒక దఫా 8 ఏండ్లు, మరో దఫా 6 ఏండ్లకాలంలో మూడు రెట్లయ్యింది. ఈ నేపథ్యంలో బంగారంలో మదుపుచేసిన ప్రతీవారిమదిలో మెదిలే ప్రశ్న ఇప్పటి రూ.70,000 స్థాయి నుంచి మూడు రెట్లు పెరిగి ఎన్నేండ్లకు రూ.2 లక్షల మార్క్ దాటుతుంది?  పుత్తడి భవిష్యత్తులో ఇచ్చే రాబడులు, రూ.2 లక్షలు ఎంతకాలానికి చేరుతుందనే అంశాలపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం!

నిపుణుల ఆశాభావం

బంగారం ధరలు మూడు రెట్లు పెరిగి రూ.2 లక్షల స్థాయిని అధిగమిస్తాయన్న ఆశాభావాన్ని కొద్దిమంది నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ‘ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావొచ్చు. చైనాబె ఉద్రిక్తతలు కూడా అనిశ్చిత పరిస్థితులను తీసుకు వస్తాయి. ఈ రెండు అంశాలకు తోడు న్యూయార్క్‌లోని కామెక్స్, షాంఘై గోల్డ్ ఎక్సేంజ్‌లో బంగారంలో భారీ ట్రేడింగ్ జరగడం ధరల్ని ఎగదోస్తాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆరేండ్లలోనే బంగారం ధర మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నా’నని ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా చెప్పారు. అయితే బంగారం మూడు రెట్లుకావడానికి గతంలో 19 ఏండ్లు సమయం కూడా పట్టింది.

ఈ సంగతిని కూడా విస్తరించరాదని అనలిస్టులు చెపుతున్నారు. ‘ ఇతర ఆస్తుల్లానే బంగారానికీ బుల్, బేర్ మార్కెట్లు ఉంటాయి. దీంతో వార్షిక రాబడుల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఒక్కో ఏడాది తగ్గుతుంది కూడా. అయితే మెరుగైన ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలేవీ లేనపుడు వినియోగదారులు, ఇన్వెస్టర్ల నుంచి పుత్తడి భారీ డిమాండ్ ఉంటుంది. వారి రాబడి అంచనాల్ని అందుకునేలా పెరుగుతుందని ఆశిస్తున్నా’ అంటూ నిప్పన్ ఇండియా కమోడిటీస్ హెడ్ విక్రమ్ ధావన్ చెప్పారు. 

డిమాండ్ సరఫరా

బంగారం ధరను సంక్షోభాలే కాకుండా ఇతర అంశాలు సైతం ప్రభావితం చేస్తుంటాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంటే దానికి రక్షణగా పుత్తడిలో పెట్టుబడులు పోటెత్తుతాయి. అధిక ద్రవ్యోల్బణం నెలకొన్న సమయాల్లో సైతం బంగారం విలువ చెక్కుచెదరదన్న విశ్వాసమే దీనికి కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ హెడ్ హరీశ్ విశ్లేషించారు. ధరను ప్రభావితం చేసే మరో అంశం డిమాండ్ బంగారం సరఫరా పరిమితంగానే ఉంటుంది. అందుకే దీనికి అధిక విలువ.

మైనింగ్ ద్వారా మార్కెట్లోకి ప్రతీ ఏడాది వచ్చే బంగారం పరిమాణం స్థిరంగా ఉంటుంది. మరోవైపు రీసైక్లింగ్ ద్వారా కొత్త పుత్తడి సరఫరా అవుతుంది. పరిమిత సరఫరా కారణంగా డిమాండ్ ఏమాత్రం పెరిగినా ధర ఎగిసిపోతుందని హరీశ్ వివరించారు. రష్యా, చైనా, ఇండియా తదితర దేశాల కేంద్ర బ్యాంక్‌ల నుంచి డిమాండ్ పెరుగుతున్నందున సరఫరాపై ఒత్తిడి ఏర్పడి పసిడి ధరలు గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతాయని అంచనా వేశారు.


బంగారం ధర మూడు రెట్లు అయ్యేందుకు పట్టిన సమయం

తేదీ 10 గ్రాముల ధర సమయం

999 స్వచ్ఛత (రూ.ల్లో)

ఏప్రిల్ 19, 2024 73,596 8 ఏండ్ల 9 నెలలు

జూలై 24, 2015 24,740 9 ఏండ్ల 5 నెలలు

మార్చి 3, 2006 8,250 18 ఏండ్ల 11 నెలలు

మార్చి 31, 1987 2,570 8 ఏండ్లు

మార్చి 31, 1979 791 6 ఏండ్లు

మార్చి 31, 1973 278

(2001 నుంచి ఐబీజీఏ ధరల ఆధారంగా. అంతకు ముందు రిజర్వ్‌బ్యాంక్, అభయా గోల్డ్ బయ్యర్స్ వార్షిక సగటు ధరల ఆధారంగా)