calender_icon.png 17 November, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్ర‘యోగా’లూ అందమే!

22-06-2024 12:44:50 AM

ఆరోగ్య యోగం పొందే ప్రయత్నంలో సెలబ్రిటీలు వివిధ మార్గాలను ఎంచుకుంటారు. ఇందుకోసం సినీ రంగ ప్రముఖులు అనుసరించే దినచర్యపై ప్రతి ఒక్కరికీ ఆసక్తే. యోగా సాధనను మించింది లేదంటూ, ఆ ఆసనాలు ప్రాక్టీస్ చేసే నటీనటులూ ఉన్నారు. శుక్రవారం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొందరు హీరోయిన్లు ఆసనాలు వేస్తున్న వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

యోగా సాధకులకు, అభిమానులకు యోగా డే శుభాకాంక్షలు చెప్తూనే.. యోగా గురించి కూడా రెండు ముక్కల్లో తమ అభిప్రాయాన్నీ వ్యక్తపరిచారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానీతో కలిసి యోగా సాధన చేశారు. ‘ఆరోగ్యం విషయంలోనే కాదు అన్నింటిలోనూ కలిసి పనిచేయడం బాగుంటుంది’ అంటూ ఆ ఫొటోలను షేర్ చేశారామె. ‘నా జీవితంలో మంచి మార్పులు తెచ్చిన యోగాకు ధన్యవాదాలు’ అంటూ బాలీవుడ్ నటి మలైకా అరోరా స్టిల్స్ ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశారు.

‘నా జీవిత ప్రయాణంలో యోగా అనేది సమతుల్యత, ప్రశాంతత కోసం చేసే ఎంచుకున్న మార్గం. ప్రతి భంగిమా నాలో అంతర్గత సామరస్యానికి ఒక మెట్టులా ఉపయోగపడుతుంది’ అని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెప్పుకొచ్చింది. ‘ప్రతి భావోద్వేగం శ్వాసతో ముడిపడి ఉంటుంది. శ్వాస, దాని లయను ఓ అవగాహనతో మార్చితే ఎమోషన్ కూడా మారుతుంది’ అని శిల్పాశెట్టి పేర్కొన్నారు. ఇంకా మలైకా అరోరా, కరీనా కపూర్, నేహా ధూపియా సైతం యోగా స్టిల్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ అందాల తారల ప్ర‘యోగా’లూ అందంగానే ఉన్నాయి కదూ!