22-06-2024 12:00:00 AM
భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. ఒకప్పుడు మన దేశానికి పరిమితమైన దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించేలా చేసింది మన ప్రధాని నరేంద్ర మోడీయేనని చెప్పాలి. 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ప్రధాని ఏడాదిలో ఉత్తర అర్ధగోళంలో అత్యంత దీర్ఘ రోజయిన జూన్ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని’ పాటించాలని పిలుపునిచ్చారు. ఇందుకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి ‘డే ఆఫ్ యోగా’ పేరుతో ఒక ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి అశోక్ ముఖర్జీ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా 177 సభ్య దేశాలు ఏకగ్రీవంగా మద్దతు తెలియజేశాయి. ఇన్ని దేశాలు ఒక తీర్మానాన్ని ప్రతిపాదించడం ఐరాస చరిత్రలోనే ప్రథమం. దీంతో ప్రతి ఏటా జూన్ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని’ పాటించడం మొదలైంది.
‘ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా ఏ సిద్ధాంతం, మతం, సంస్కృతి అయినా బతికి బట్టకట్టడం చాలా కష్టం. ఇంతకాలం యోగా ఓ అనాథలాగా ఉండింది. ఇప్పుడు అంతర్జాతీయంగా సాధికారిక గుర్తింపు లభించడం యోగా ప్రయోజనాలు మరింత వ్యాప్తి చెంద డానికి దోహదపడుతుంది’ అని మోడీ కృషిని ప్రశంసిస్తూ ‘ఆర్ట్ ఆఫ్ లివిం గ్’ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్ అప్పుడు అన్న మాటలు ఇప్పుడు సాకారమయ్యాయి. 2015 జూన్ 21న జరిగిన తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మోడీ సహా ప్రపంచ వ్యాప్తంగా 84 దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు. అదే ఏడాది భారత రిజర్వ్ బ్యాంక్ యోగా దినోత్సవాన్ని పురస్కరించి పది రూపాయల ప్రత్యేక నాణేన్ని విడుదల చేసింది. ఈ పదేళ్ల కాలంలో యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం, గుర్తింపు లభించాయి.
2017లో యుఎన్ పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకే షీటుపై పది ఆసనాల స్టాంపులను విడుదల చేసింది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక అంశానికి ఇంత గుర్తింపు రావడం చాలా అరుదనే చెప్పాలి. ప్రతి ఏటా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఒక్కో ప్రాంతంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది శ్రీనగర్‌లోని డాల్ సరస్సు సమీపంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఇప్పుడు విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు.
ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురువును ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఆమె ఎప్పడూ భారత్‌కు రాకపోయినా యోగాపై అవగాహన కల్పించడం కోసం తన జీవితాన్ని ధార పోశారన్నారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో ఇప్పుడు యోగాపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. జర్మనీలో కోటిమంది యోగా నేర్చుకుంటున్నారన్నారు. 2015 తర్వాతే ఈ మార్పు వచ్చిందన్నారు. న్యూయార్క్‌లోని టైమ్‌స్కేర్ కూడలిలో దాదాపు పది వేలమంది యోగాసనాలు వేయడం ఈ ఏడాది ప్రత్యేకత. సరిహద్దుల్లోని సైనికులు మొదలుకొని యుద్ధనౌక విక్రమాదిత్య దాకా అనేక చోట్ల యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.
యోగా అనేది కేవలం శరీరానికి సంబంధించిన ఎక్సర్‌సైజ్ మాత్రమే కాదు. దేహానికి ధ్యానం లాంటిది యోగా. ఒక్కో ఆసనం ఒక్కో అవయవానికి సాంత్వనను, ఉత్తేజాన్ని అందిస్తుందని పరిశోధనల్లో సైతం నిరూపితమైంది. ఆధునిక సమాజంలో పెరిగిపోయిన ఆందోళన, అనిశ్చితి వంటి రుగ్మతలకు యోగా అద్భుతమైన ఒక పరిష్కార మార్గం. ఇది శరీరాన్నే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి దోహద పడుతుంది. మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన యోగా ఇప్పుడు ఆరోగ్యార్థుల పాలిట వరమైంది. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగం చేసుకోవాలి.