22-06-2024 12:00:00 AM
వయోధికులకు 2019 వరకు రైల్వే ప్రయాణంలో రాయితీ ఉండేది. కరోనా లేదా మరో పేరుతో మోడీ ప్రభుత్వం దీనిని తొలగించి మళ్లీ పునరుద్ధరించక పోవడం అన్యాయం. వృద్ధాప్యంలో భక్తి, ఆధ్యాత్మిక యాత్రలకో, తమ పిల్లలను చూడటానికో రైలులో ప్రయాణించడానికి రాయితీ ఉపయోగపడేది. ఇంతేగాక, వైద్య సౌకర్యాలు కలిగిన నగరాలకు, ప్రదేశాలకు వెళ్లడానికీ సౌలభ్యంగా ఉండేది. రాయితీలు కలిగి ఉన్నామని వయోధికులు రైళ్ళలో తరచుగా ప్రయాణించలేరు, అత్యవసరమైతేనే వెళుతుంటారు. వయసురీత్యా అదే పనిగా ప్రయాణాలు చేయడమూ వారికి కష్టం. వైద్యుల సలహాలపైనే ప్రయాణిస్తుంటారు.
ఎప్పుడో ఒకసారి మానసిక ఉల్లాసానికి ప్రయాణాలు చేద్దామనుకుంటే, రాయితీ వుంటే ఉపయోగపడుతుంది. ప్రస్తుత వయోధికులు యవ్వనదశలో ఆయా రంగాలలో దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేసిన వారే కదా. రవాణా సౌకర్యాలలో రాయితీలు కల్పించడం సంక్షేమ రాజ్య ప్రధాన కర్తవ్యం కూడా. అందులో రైల్వేవారి రాయితీ కేవలం ప్రయాణానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రయాణంలో భాగంగా ఆహారం, ఇతర పదార్థాలు కొనవలసి ఉంటుంది కూడా. వయోధికులకు రాయితీలు కల్పించడం పట్ల రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభించడం బాధాకరం. ఎంతో శ్రమకోర్చి ఓటింగులో వారూ పాల్గొంటారన్న విషయాన్ని ఆయా రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి.
దండంరాజు రాంచందర్ రావు