22-06-2024 12:00:00 AM
ఆచార్య మసన చెన్నప్ప :
అరటి పండ్లు తిన్న బలమో ఏమో అసలు ఏం జరుగుతుందో తెలియకుండానే మేం అయిదుగురం పిల్లలం ఆ బండి వెనుక పరుగులు తీస్తున్నాం. తెలియకుండానే అర మైలు దూరం దాటేశాం. అప్పుడు జరిగింది మేమెవరమూ ఊహించని సంఘటన. ఎదురుగా వచ్చిన లారీ పక్కనుంచి వెళుతూ అనుకోకుండా బండిని తాకింది. అంతే!
మంచి పని చేయడానికి మనసుండాలె కాని వయసుతో ఏం పని! ఇప్పటికీ కొందరు పిల్లలు మంచిపనులు చేస్తుంటారు. అప్పట్లో అంటే, సుమారు ఓ అరవై ఏండ్ల క్రితం అయిదుగురు పిల్లలు చేసిన మంచిపని తలచు కుంటే హృదయం ఉప్పొంగుతుంది. ఎందుకంటే, వాళ్లలో నేనూ ఒకణ్ణి కనుక. నేనప్పుడు ఐదవ తరగతి చదువుతున్నాను. పదేళ్ల వయసులో ఉండి ఉంటా ను. టీచర్లు నన్ను అభిమానించడం వల్ల వారికి నేను చాలా సన్నిహితం అయ్యాను. వాళ్లకు కావలసిన పనులన్నీ చేసి పెట్టడంలో నేనందరికంటే ముందుండే వాణ్ణి.
ఆనాటి చదువుల బళ్లు ప్రత్యేకమైనవి. చదువు రావాలంటే పిల్లలకు చదువుమీద శ్రద్ధ ఉంటే సరిపోదు. అధ్యాపకులకు అన్ని విధాల ‘సేవలు’ చేయాలి. ‘గురుసేవ’ కూడా విద్యాభ్యాసంలో భాగంగా మనం నేర్చుకొనే ‘వినయం’ కిందికి వస్తుంది. నేను మా ఇంట్లో చిన్నవాణ్ణి కాబట్టి, నాకు ఇంట్లో ఏ పనీ ఉండేది కాదు. అన్నలు కాకే పనీ చెప్పేవారు కారు. అమ్మానాన్నలకైతే నేను చాలా ఇష్టపాత్రుణ్ణి. అందుకే, చదువుకొమ్మని ప్రోత్సహించేవారు. ఆ కష్టమే దో పంతుళ్లకు చేసేవాణ్ణి. ఆ విషయం ఇంట్లోకూడా తెలిసేది కాదు. బడి విడిచిపెట్టిన తర్వాత నేను బాగా అభిమానించే అధ్యాపకుని ఇంట్లో ఉండడమే అలవాటైంది. వంట చేయడం, బట్టలు ఉతకడం వగైరా పనులు చిన్ననాడే అభ్యాసంలోకి వచ్చాయి. అధ్యాపకులు వ్యక్తిగతంగానేకాక అందరూ కలిసి కూడా పిల్లలకు కొన్ని పనులు అప్ప చెప్పేవారు. చదువు కూడా బాగా చెప్పేవారు కాబట్టి, వారికి సంబంధించిన పనులను చేయడంలో ఉత్సాహా న్ని చూపెట్టేవాళ్లం.ఎప్పుడూ నేనూ, ఇంకో నలుగురు విద్యార్థులం కలిసి ఉండేవాళ్లం.
ఒకరోజు “రెవెన్యూ స్టాంపులు కావాలి. తెచ్చి పెడతారా?” అని మా అధ్యాపకులు కోరారు. మా ఊరు కొల్కులపల్లికి 4 మైళ్ల దూరంలో ‘మాల్’ ఉంది. ‘మాల్’కు వెళ్లి తేవాలి. బస్సు సౌకర్యం తక్కువ కనుక, నడిచే వెళ్లాలి. ఒకేసారి ‘ఇరవై స్టాంపులు తెమ్మని’ మా అధ్యాపకులు పైసలిచ్చారు. ఆ రోజుల్లో ఒక్క రెవెన్యూ స్టాంపు విలువ పది పైసలుండేది. మేం నడిచి వెళ్లి రావాలి కనుక, బస్సు చార్జీ లేమీ అడగలేదు. నాతోపాటు ఇంకో నలుగురం కలిసి బయల్దే రాం. నలభై నిముషాల్లో 4 మైళ్లు నడిచి ‘మాల్’ చేరుకున్నాం. స్టాంపులు కొన్నాం. వాటిని నేనే జేబులో భద్రపరచుకున్నాను.
స్టాంపులు కొనగా, ఒక చారాణా (ఇరవై అయిదు పైసలు) మిగిలింది. మా స్నేహితుడు ఒకడు ‘చాక్లెట్లు కొందా’మన్నాడు. ఇంకొకడు ‘పల్లీలు కావాలని’ అడి గాడు. “లేదు. మనం ఏమీ కొనవద్దు. మన గురువులు మనల్ని కోప్పడుతారు” అని నేను బుద్ధిగా సమాధానం చెప్పేసరికి వారూ ఊరుకున్నారు. మా అందరిలో వయస్సులో చిన్నవాడు “నాకు బాగా ఆకలేస్తోంది, ఒక అరటి పండైనా తిందాం” అన్నాడు. నిజానికి నాకూ ఆకలిగానే వుంది. ‘ఏదైతే అదయింది’ అనుకొని “సరే, అరటి పళ్లు తిందాం” అని ఒక అయి దు పైసలు ఇచ్చి, 5 అరటి పళ్లు కొని, తలా ఒకటి తిని ఆకలి తీర్చుకున్నాం. నయా పైసకు ఆనా డు ఎంతో విలువ. దొవ్వానా (పన్నెండు పైసలు) ఇస్తే డజన్ అరటి పండ్లు ఇచ్చేవారు. ఇంకా ఇరవై పైసలు నా జేబులోనే వున్నాయి.
అంతా మన మంచికే
‘మాల్’ రోడ్డుమీదికి రాగానే మాకు ఒక ఎడ్లబండి కనిపించింది. అది మా ఊరువైపే వెళుతోంది. అందరికీ కాళ్లు లాగు తున్న విషయం అప్పుడు తెలిసింది. ‘ఆ బండెక్కి పోతే..’ అనిపించింది మాకు. నేను బండి నడుపుతున్న యజమానితో, “మమ్మల్ని రెండు మైళ్ల దూరం బండెక్కించు కొని తీసుకొని వెళ్లవా?” అని బతిమిలాడాను. “లేదు లేదు. మీరు అల్లరి పిల్లలు. మీరెక్కితే మా ఎడ్లు బెదురుతై. మీ బడిపిల్లలు సామాన్యులు కారుగా..” అన్నాడత ను. నిజానికి ఎడ్లబండి ఖాళీగానే ఉంది. బండి నడిపే అతనొక్కడు తప్ప. నేను మారు మాట్లాడలేదు. మేం అల్లరి పిల్లలమే కావచ్చు. కానీ, వినయ విధేయతలు కలిగిన వాళ్లమే. ఆ విషయం అతనికెలా చెప్పాలో మాకు తెలియలేదు.
అతను బండిని వేగంగా తోలుతున్నా డు. మేం సరదాగా బండి వెనుక నడవసాగాం. బండి మెల్లమెల్లగా మరింత వేగం గా పుంజుకొంటున్నది. ఎడ్లను గదుముతున్నాడు. అవి పరుగెత్తుతున్నాయి. మేమూ, అంతే వేగంతో బండి వెనుక పరుగుమొదలు పెట్టాం. అప్పటికీ ఆ బండి నడిపేత ను మా పట్ల కనికరం చూపలేదు. బండి ఆపేసి, “ఎక్కండెక్కండి” అంటాడేమో అని ఆశగా దాని వెంట పరుగులు తీస్తున్నాం. అతను మమ్మల్ని చూసి నవ్వుతున్నాడే కానీ బండి ఆపడం లేదు.
అరటి పండ్లు తిన్న బలమో ఏమో అస లు ఏం జరుగుతుందో తెలియకుండానే మేం అయిదుగురం పిల్లలం ఆ బండి వెనుక పరుగులు తీస్తున్నాం. తెలియకుండానే అర మైలు దూరం దాటేశాం. అప్పు డు జరిగింది మేమెవరమూ ఊహించని సంఘటన. ఎదురుగా వచ్చిన లారీ పక్కనుంచి వెళుతూ అనుకోకుండా బండిని తాకింది. అంతే! ఉన్నట్టుండి బండి పక్కకు వంగిపోయి ఒంటి చక్రంపై వెళుతూ రోడ్డు పక్కన వున్న గుంతలోకి దిగి పడిపోయిం ది. మేం, అక్కడిక్కడే ఆగిపోయి, గుడ్లు తేలే శాం. లారీ వేగంగా దుమ్ము రేపుకుంటూ వెళ్లిపోయింది. అప్పుడే వినిపించింది బండి నడిపేతని కేక! అందరం రోడ్డు పక్కన వున్న గుంతవైపు పరుగు తీశాం.
ఎడ్లు ఒకచోట, బండి ఒకచోట. పక్కనే ఒళ్లు హూనమైన బండి యజమాని మూలుగుతూ కనిపించాడు. చేతులకు, కాళ్లకు ఎర్రగా రక్తం మరకలు. మాకు క్షణంలో భయమేసింది. ఏం చేయాలో తోచలేదు. అతను లేద్దామనుకుంటున్నా డు కానీ, లేవలేకపోతున్నాడు. మేమంతా ఆలస్యం చేయకుండా అతణ్ణి సమీపంచి, పట్టుకొని చేతులు పట్టుకొని లేపాం. గుం తలోంచి పైకి తెచ్చాం. గట్టుమీదికి వచ్చాక అతను మాకేసి తప్పు చేసిన వాడిలా చూసిన చూపు నాకిప్పటికీ గుర్తు.
అందరం ఒకరి మొహాలొకళ్లం చూసుకున్నాం. ‘మేం ఆ బండిలో వుండి వుంటే?’ అన్న ఆలోచన వచ్చిందేమో, నాకైతే ఒళ్లు జలదరించింది. గుంతలో పడగానే ఎడ్లు బండి నుంచి విడివడ్డాయి. అవి దూరంగా నిలబడి బెంబేలెత్తిపోయి భయం భయం గా చూస్తున్నాయి. ఎడ్లకు గాయాలేమీ కాలేదు. బండి తలకిందులై ఆ పెద్ద గోతి లో పడి పోయింది. దాన్ని బయటికి తీసే శక్తి మాకు లేదు. ఇంతలో మేం వచ్చిన దారిలోంచే మరో ఎద్దుల బండి రావడం కనిపించింది. ఆ కొత్త బండి యజమాని సాయంతో అతణ్ణి అందులోకి ఎక్కించాం. అతడి చేతులు సరిగా లేవకపోయినా మా కు దండం పెడుతున్నాడు. మాకేం చెప్పా లో తోచలేదు. బిత్తర చూపులు చూడటం తప్ప పిల్లలం మేం, మరేం చేయగలం! అతడేదో మాట్లాడాలని అనుకున్నాడు కాని, పెదాలు సహకరించలేదు. అతణ్ణి బండెక్కించుకున్న పెద్ద మనిషి పిల్లలమైనప్పటికీ మేం చేసిన మంచిపనిని మెచ్చుకు న్నాడు. “మీరూ బండి ఎక్కండి. మీ ఊరు దగ్గర దింపుతాను” అన్నాడు. మేం ఆ మాటలకు సంతోష పడలేదు. ఒక్కసారిగా, “మేం నడిచి వస్తాం” అన్నాం. మొదట మేం బండి ఎక్కక పోవడం మా మంచికేనేమో అనిపించింది తర్వాత.
వ్యాసకర్త సెల్: 9885654381