03-07-2025 12:42:34 AM
-ఎడాపెడా రోడ్ల ఆక్రమణ
- రాకపోకలకు ఆటంకం
-పట్టించుకోని యంత్రాంగం
మహబూబాబాద్, జూలై 2 (విజయ క్రాంతి): ఆర్ అండ్ బి రోడ్లను కొందరు ‘హద్దు’ మీరి ఆక్రమించి పక్కా నిర్మాణాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు కళ్ళున్న కబోదుల్లా చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల ప్రధాన రహదారులపై రాకపోకలకు ఆటంకంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో అధికారుల ఉదాసీన వైఖరి ఇప్పుడు రోడ్ల విస్తరణ అడ్డుగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.
రోడ్లపై అక్రమ నిర్మాణాలను చేపట్టకుండా ఆదిలోనే చర్యలు తీసుకొని ఉంటే, ఇప్పుడు రోడ్ల విస్త‘రణం’ చేసే పరిస్థితి తలెత్తి ఉండేది కాదనే ఆరోపణలు వస్తున్నాయి. కేసముద్రం పట్టణంలో ఇటీవల రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా జ్యోతిబా పూలే విగ్రహం నుండి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు 100 అడుగుల రోడ్డుకు అవసరమైన భూసేకరణ నిర్వహించి భూ నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం అందజేసింది.
పరిహారం తీసుకున్న వారికి సంబంధించిన స్థలాలను, నిర్మాణాలు ఉంటే వాటికి నిర్ణయించిన ప్రకారం డబ్బులు చెల్లించి 100 అడుగుల రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని స్వాధీనం చేసుకుని ఫ్లై ఓవర్ నిర్మించడంతోపాటు, ఆర్‌ఓబి కి ఇరువైపులా సర్వీస్ రోడ్లను కూడా నిర్మించారు. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో 100 అడుగులు ఉండాల్సిన రోడ్డు ఇప్పుడు 30 అడుగులకు కుదించుకుపోయింది. 100 అడుగుల రోడ్డుకు ఇరువైపులా కొందరు హద్దు మీరి భవనాలను నిర్మించడంతోపాటు, షెడ్లు వేసుకుని రోడ్డును పూర్తిగా ఆక్రమించారు.
దీనితో ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకంగా మారింది. ఈ క్రమంలో కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, సబ్ స్టేషన్ తండ, దనసరి, అమీనాపురం గ్రామాలు విలీనం చేసి కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు , మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి పట్టణ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా మంజూరు చేయించడంతోపాటు, 45 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణంలోని వివిధ రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ కోసం అదనంగా నిధులు మంజూరు చేయించారు.
ఇప్పుడు రోడ్ల విస్తరణ కోసం పనులు చేపడుతుండగా అడుగడుగునా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ చేయాలని నిర్ణయించగా, ఇప్పుడు 60 ఫీట్లకే కుదించాలనే నినాదంతో షాపుల యజమానులు, నివాస గృహాలకు చెందినవారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం వల్ల తమకు తీరని నష్టం వాటిల్లుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేతులు కాలాక...!?
ఎడాపెడా రోడ్లపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోకుండా, తీరా ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. గ్రామపంచాయతీ గా ఉన్న సమయంలో గతంలో టిడిపి ప్రభుత్వ హాయంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో 50 లక్షల రూపాయలతో కేసముద్రం స్టేషన్ మేజర్ పంచాయతీలో డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో మార్కెట్ రోడ్డులో గ్రెయిన్ మార్కెట్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఒకవైపు డ్రైనేజీ నిర్మించారు.
అదేవిధంగా పొట్టి శ్రీరాములు సర్కిల్ దాటిన తర్వాత కొద్దిదూరం నుంచి ఉప్పరపల్లి చౌరస్తా ప్రాథమిక పాఠశాల వరకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించారు. అలాగే రైల్వే అండర్ డ్రైనేజీ నీరు దిగువకు వెళ్లే విధంగా తెలంగాణ స్తూపం నుంచి ఉప్పరపల్లి చౌరస్తాలో ఉన్న ప్రాథమిక పాఠశాల వరకు పెద్ద డ్రైనేజీ నిర్మించారు. అప్పట్లోనే భవిష్యత్తు అవసరాలను గుర్తించి రోడ్డు విస్తీర్ణాన్ని పెంచి డ్రైనేజీ కాలువలు నిర్మించారు.
ఇప్పుడు ఆ కాలువలపై అనేక చోట్ల పూర్తిగా పైకప్పు వేసి, కొందరు పక్కా నిర్మాణాలు చేపట్టడంతో పాటు, షెడ్లు ఇతర నిర్మాణాలు చేపట్టి ఆక్రమించారు. అలాగే పలుచోట్ల వరద కాలువలు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్నారు. ఇంతకాలం చూసి చూడనట్లు వదిలి పెట్టిన అధికారులు ఇప్పుడు వాటిని ఉన్నఫలంగా తొలగించాలంటూ నోటీసులు జారీ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇంతకాలం ఎందుకు ఉపేక్షించారనే విమర్శలు వస్తున్నాయి.