03-07-2025 02:14:49 PM
భవిత కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): మానసిక వికలత్వంతో ఉన్న (ప్రత్యేక అవసరాల పిల్లల) సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని, వారికి మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(Nagarkurnool Collector Badavath Santosh) అన్నారు. గురువారం తెలకపల్లి మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాల పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు, వికలత్వం నుండి ఉపశమనం కోసం ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వంటి సేవలు అందించాలన్నారు.
వారికి సానుభూతితో కూడిన వాతావరణం కల్పించాలని సూచించారు. కేంద్రంలో ప్రస్తుతం 20 మంది విద్యార్థులు ఉన్నారు. థెరపీ సేవల కోసం ఇటీవల రూ.2 లక్షలతో కొనుగోలు చేసిన పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కేంద్ర బోధనా సిబ్బంది, థెరపీ టీమ్‌తో కలెక్టర్ సమావేశమయ్యారు. ప్రభుత్వం తరఫున పిల్లలకు అవసరమైన విద్యా ఉపకరణాలు, టెక్స్‌బుక్స్, ప్రత్యేక కౌన్సిలింగ్, టెక్నాలజీ ఆధారిత వసతులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారితో పాటు డీఈఓ రమేష్ కుమార్, తహసీల్దార్ జాకీర్ ఆలీ, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, భవిత కేంద్ర కోఆర్డినేటర్ బాల నరసింహ, ప్రత్యేక ఉపాధ్యాయుడు శేఖర్ ఉన్నారు.