10-05-2025 12:26:07 AM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓ యువకుడు మద్యం మత్తులో కిందపడి తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న వైన్ షాప్ లో మహారాష్ట్రకు చెందిన మోహన్ దుర్గే అనే వ్యక్తి అతిగా మద్యం సేవించాడు. అతిగా మద్యం సేవించి రోడ్డుపై కింద పడడంతో తలకు బలంగా గాయమైంది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన సదరు వ్యక్తిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను మంచిర్యాలకు తరలించారు. మోహన్ దుర్గే కూలి పని కోసం బెల్లంపల్లికి వచ్చాడనీ తెలుస్తుంది. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.