07-01-2026 04:13:50 PM
సివిల్ కోర్టు జడ్జి ఎండి గౌస్ పాష
తుంగతుర్తి,(విజయక్రాంతి): డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలని తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎండి గౌస్ పాషా పిలుపునిచ్చారు. బుధవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞాన సుందర్ ఆధ్వర్యంలో, ఏర్పాటుచేసిన ర్యాలీలో పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు కోర్టు నుండి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ...యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.
యువత డ్రగ్స్‌తో పాటు గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలన్నారు.విద్యార్థులకు చదువుతో పాటు నమస్కారం, క్రమశిక్షణ చాలా కీలకమని పేరొన్నారు. తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు మాట్లాడుతూ... డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ పనిచేయాలని, డ్రగ్స్ నియంత్రణలో పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. మత్తు పదార్థాలు సేవించిన వారి వివరాలు తెలిస్తే 1908 సమాచారం అందించాలని, సైబర్ నేరాలు అరికట్టేందుకు (1930) సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎక్సైజ్ సీఐ రజిత, ఎస్సై క్రాంతి కుమార్, ఎక్సైజ్ ఎస్సైల న్యాయవాదులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.