26-08-2025 03:27:55 PM
అమరావతి: కూటమి ప్రభుత్వానికి(AP Government) దివ్యాంగులపై మానవత్వం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ఆరోపించారు. కనికరం లేకుండా వారి పొట్ట కొట్టాలని చూడటం దారుణమన్నారు. వికలాంగుల జీవితాల్లో వెలుగులు పోయి చీకటి నింపడం దుర్మార్గమని మండిపడ్డారు. అనర్హుల కింద అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని చూడటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హత పేరుతో 20 ఏళ్ల నుంచి పెన్షన్ పై బ్రతుకుతున్న వారికి సైతం రద్దు చేయాలని చూడటం సిగ్గుచేటు అన్నారు. వికలాంగుల జీవితాలతో రాజకీయం తగదని సూచించారు.
బోగస్ పెన్షన్లు గుర్తించడం మంచిదే.. వికలాంగుల ముసుగులో అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులను ఏరివేత హర్షించ దగ్గదే అన్నారు. దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వారిపై, ఇచ్చిన వైద్యులపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని పేర్కొన్నారు. కానీ రీ వెరిఫికేషన్ పేరిట అర్హులను సైతం అనర్హులుగా పరిగణించడం పద్దతి కాదన్నారు. అర్హుల పేర్లు తొలగించి వారిని వేధించడం సరికాదన్న షర్మిల నోటీసులు ఇచ్చిన 1.20 లక్షల మందిలో అర్హులే ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోందన్నారు. అనర్హులుగా గుర్తించిన జాబితాపై మళ్ళీ వెరిఫికేషన్ చేయాలని కోరారు. అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని, వెంటనే వారి పెన్షన్లు పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నామని ఆమె తెలిపారు.