వేతనాలు ఇప్పించాలని తహసీల్దార్ కు వినతి
సాలూర, అక్టోబర్ 03 (విజయక్రాంతి): సాలూర మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల(PM Shri ZP High School)లో ఒకేషనల్ ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతికి నిబద్ధతతో సేవలు అందిస్తున్నప్పటికీ, గత ఐదు నెలలుగా తమకు వేతనాలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నెలవారీ వేతనాలు నిలిచిపోవడంతో కుటుంబ పోషణ, ఇళ్ల ఖర్చులు, వైద్య అవసరాలు తీర్చుకోవడం తలకు మించిన భారంగా మారిందని వాపోయారు. ఈ సమస్యపై సాలూర తహశీల్దార్ ఆజ్మత్ నవాజ్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. తక్షణమే స్పందించి పెండింగ్ జీతాలను ఇప్పించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒకేషనల్ ఉపాధ్యాయులు మెడి రవి, జాదవ్ అక్షయ్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.