ఘనంగా భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు
బిర్సా ముండా ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి: బానోత్ నరేష్ నాయక్
కోనరావుపేట, నవంబర్ 15 (విజయక్రాంతి): గిరిజనుల ఆరాధ్య దైవం, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆదివాసీల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి(Birsa Munda Jayanti) వేడుకలను కోనరావుపేట మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీవీఎంసీ సభ్యులు బానోత్ నరేష్ నాయక్ హాజరై బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా గిరిజన ఆత్మగౌరవానికి, హక్కుల సాధనకు, పోరాట స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు.బ్రిటిష్ పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి ఆదివాసీల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప యోధుడని పేర్కొన్నారు.
ఆయన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.నేటి విద్యార్థులు బిర్సా ముండా జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, ముఖ్యంగా గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
గిరిజనుల హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బిర్సా ముండా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని తెలిపారు.అనంతరం విద్యార్థులకు బిర్సా ముండా జీవిత చరిత్ర, గిరిజనుల చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో ఆదివాసీల పాత్ర గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు గీత భవానీ, రవి, తిరుపతి, రాజు, మదన్ లాల్, శ్యామల, ఊర్మిళ, మంజుల, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.