ఎన్‌వోసీ ఇవ్వండి

18-11-2026 | 05:25am

సమ్మక్క సాగర్ బరాజ్‌పై ఛత్తీస్‌గఢ్ సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి

  1. సానుకూలంగా స్పందించిన విష్ణుదేవ్ 
  2. రూ. 2వేల కోట్లతో 2021లో పూర్తయిన బరాజ్ 
  3. ముంపుపై అభ్యంతరాలు చెప్తున్న ఛత్తీస్‌గఢ్ 
  4. రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎంతో చర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  5. ముంపు బాధితులకు పరిహారం చెల్లిస్తామని వెల్లడి 
  6. సహకార సమాఖ్య స్ఫూర్తితో ముందుకు వెళ్దామని సూచన 
  7. ఎన్‌వోసీ జారీ ప్రక్రియ త్వరగా పూర్తిచేస్తామన్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్

నవంబర్ 17 (విజయక్రాంతి): సమ్మక్క సాగర్ బరాజ్‌కు(Sammakka Sagar Barrage) నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(No Objection Certificate) (ఎన్‌వోసీ) జారీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఛత్తీస్‌గఢ్ ముఖ్య మంత్రి విష్ణుదేవ్ సాయ్(Chhattisgarh Chief Minister Vishnu Deo Sai) హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి(N. Uttam Kumar Reddy) మంగళవారం రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎంతో భేటీ అయ్యారు. ప్రాజెక్టుకు అవసరమైన ఎన్‌వోసీని త్వరగా ఇవ్వాలని కోరారు. అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్.. ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.

సమ్మక్క సాగర్ బరాజ్ అంశానికి పరిష్కారం లభిస్తే గోదావరి జలాల వినియోగంలో అంతర్రాష్ట్ర సహకారానికి ఆదర్శమవుతుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. చర్చ లు, శాస్త్రీయ అంచనాల ద్వారా అభివృద్ధి పనులను ముందు కు తీసుకెళ్తూనే స్థానికుల ప్రయోజనాలను కాపాడవచ్చని తెలిపారు. ముంపు అంశాల పరిశీలనకు, ఉమ్మడి సర్వేలు, వివ రాల నిర్ధారణకు సహకరించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇరు రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూరే పరిష్కారాన్ని తెలంగాణ కోరుకుంటున్నదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

ముంపు బాధితులకు పరిహారం.. 

ముంపు, బరాజ్ వల్ల బ్యాక్‌వాటర్ ప్రభావంపై ఛత్తీస్‌గఢ్ లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పరిహారం చెల్లించేందుకు  అవసరమైన చట్టాలు, నిబంధనలు అమలు చేస్తామని.. అవసరమైతే ఆ మొత్తాన్ని ముందుగానే జమ చేసేందుకు తాము సిద్ధమని ఆయన స్పష్టంచేశారు. ముంపు అంచనా, వివరాల నిర్ధారణకు అయ్యే ఖర్చును కూడా భరిస్తామన్నారు. బరాజ్ వల్ల ఎగువన ముంపు ప్రభావంపై స్వతంత్ర అధ్యయనం చేసే బాధ్యతను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇప్పటికీ ఐఐటీ ఖరగ్‌పూర్‌కు అప్పగించింది.

ఛత్తీస్‌గఢ్ అధికారులు కోరిన సమగ్ర అధ్యయనాలు, సర్వేల కోసం తెలంగాణ సుమారు రూ. 9.8 కోట్లు చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ తన నివేదికను జులైలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి అందజేసింది. ‘భారీ వరదల సమయంలో అదనంగా ముంపునకు గురయ్యే భూమి  100 ఎకరాల లోపే ఉంటుంది. పూర్తి నిల్వ మట్టం వద్ద నదీ భాగాన్ని మినహాయిస్తే సుమారు 32 ఎకరాల ప్రైవేటు భూమి ముంపునకు గురవుతుంది. ఇరు రాష్ట్రాల అధికారులు ఇప్పటికే ఉమ్మడి సర్వేలు చేపట్టారు. రెండు రాష్ట్రాలూ అంగీకరించిన విధానంలో ముంపు బాధితులుగా గుర్తించిన ప్రతి భూ యజమానికీ పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 

రూ. 2వేల కోట్లతో బరాజ్ నిర్మాణం పూర్తి..

సమ్మక్క సాగర్ బరాజ్‌కు తొలి దశలో 50 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా, 22.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 2009లో పీవీ నరసింహారావు ‘కాంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు’ను ప్రతిపాదించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) 2012 మార్చి 2న సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. కాంతనపల్లి వద్ద ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వల్ల 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

17 ఆదివాసీ గ్రామాలు, భద్రతా మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని గుర్తించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముంపును తగ్గించేందుకు బరాజ్ స్థలాన్ని గోదావరి ఎగువన తుపాకులగూడెం గ్రామానికి మార్చి సమ్మక్క పేరుతో బరాజ్‌కు 2020 ఆగస్టు 18న రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. పూర్తి నిల్వ మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) +83 మీటర్ల వద్ద నిల్వ సామర్థ్యాన్ని 6.94 టీఎంసీలకు తగ్గించారు. తుపాకులగూడెం వద్ద గోదావరిపై సుమారు రూ. 2వేల కోట్లతో బరాజ్ నిర్మాణం 2021లో పూర్తయింది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ కింద 4.40 లక్షల ఎకరాలు, రామప్ప-  పాకాల అనుసంధాన వ్యవస్థ కింద 30 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు దీన్ని రూపొందించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో కొత్తగా 32,563 ఎకరాలకు సాగునీరు అందించడం, మార్గమధ్యంలోని గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చడం కూడా ప్రాజెక్టు లక్ష్యాలు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, జనగామ, నల్లగొండ జిల్లాల పరిధిలోని కరువు పీడిత, ఫ్లోరైడ్ ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో సాగు, తాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది.  

సీడబ్ల్యూసీ, ఛత్తీస్‌గఢ్ ఆమోదమే కీలకం

సమ్మక్క సాగర్ బరాజ్‌కు పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ అనుమతులతోపాటు తొలి, రెండో దశ అటవీ అనుమతులు ఇప్పటికే లభించాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. జలవిజ్ఞాన విభాగం, సీఎస్‌ఎంఆర్‌ఎస్, కేంద్ర భూగర్భ జల మండలి, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ తదితర సంస్థల సాంకేతిక పరిశీలనలు పూర్తయ్యాయని పేర్కొంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వద్ద పరిష్కారం కావాల్సిన ప్రధాన అంతర్రాష్ట అంశానికి ఛత్తీస్‌గఢ్ ఆమోదం తెలపాల్సి ఉంది.

ఈ అంశంపై తెలంగాణ తరఫున పలు దఫాలుగా చర్చలు జరిగాయని, లేఖలు కూడా రాశామని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. సాంకేతిక అంశాల్లో చాలా వాటిని పలుమార్లు పరిశీలించామని, నిర్ణయం తీసుకునేందుకు తగిన సమాచారం ఇప్పుడు అందుబాటులో ఉందని  తెలిపారు. ఛత్తీస్‌గఢ్  ప్రజల  ప్రయోజనాలన్నింటినీ కాపాడుతూ తెలంగాణలో లక్షలాది మంది రైతులకు సాగునీటి భద్రత కల్పించాలన్నది తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎన్‌వోసీ త్వరగా లభిస్తే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావచ్చని, ఇరు రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూరడంతో పాటు ఉమ్మడి నదీజలాల విషయంలో సహకార సమాఖ్య స్ఫూర్తి బలపడుతుందని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్‌కి ఆయన తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్‌వోసీని త్వరగా జారీ చేయాలని, మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు. ఇందుకు ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారు. 

మరిన్ని వార్తలు