ప్రెసిషన్ ఇంజినీరింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్

18-11-2026 | 05:10am

ఏరోస్పేస్‌లో పెట్టుబడులకు ప్రత్యేక కార్యాచరణ

స్థానికంగానే విమాన విడిభాగాల తయారీ, నిర్వహణకు అవసరమైన టూలింగ్

జేఈహెచ్ ఏరోస్పేస్ ‘టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ప్రెసిషన్ ఇంజినీరింగ్‌కు(Precision Engineering) కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. విడిభాగాల తయారీతో పాటు వాటికి అవసరమైన టూలింగ్, అధునాతన యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని(Tooling, advanced machinery, technology) రాష్ట్రంలోనే అందుబాటులోకి తెచ్చేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. విమానాలు, విమాన ఇంజిన్ల అసెంబ్లింగ్, మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన ప్రత్యేక టూల్స్, ఫిక్చర్లు, గేజ్‌ల తయారీ కోసం రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జేఈహెచ్ ఏరోస్పేస్ ఏర్పాటు చేసిన ‘టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(Tooling Center of Excellence)’ను మంగళవారం మంత్రి శ్రీధర్‌బాబు(Sridhar Babu) ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైజింగ్(Telangana Rising)-2047’ విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్, రక్షణ, సాంకేతిక రంగాల్లో ప్రపంచస్థాయి పెట్టుబడులకు, పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు. ముఖ్యంగా ఏరోస్పేస్ రంగంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా కాంప్రహెన్సివ్ ఎకో సిస్టంను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

విడిభాగాల తయారీతో పాటు డిజైన్, ఇంజినీరింగ్, ప్రెసిషన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ తదితర విభాగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ప్రపంచస్థాయి సంస్థలు, దేశీయ పరిశ్రమలు, పరిశోధనా సంస్థలతో స్థానిక ఎంఎస్‌ఎంఈలను అనుసంధానించడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విమానాలకు అవసరమైన ప్రత్యేక పరికరాలు, ఫిక్చర్లు, గేజ్‌ల కోసం ఇప్పటివరకు కొద్దిమంది ప్రత్యేక సరఫరాదారులపై లేదా విదేశాలపై కంపెనీలు ఆధారపడాల్సి వచ్చేదన్నారు.

ఇలాంటి అధునాతన టూలింగ్ సామర్థ్యాలు హైదరాబాద్‌లో అందుబాటులోకి రావడం రాష్ట్ర పారిశ్రామిక రంగ వృద్ధికి మరింత ఊతమిస్తుందన్నారు. ఏరోస్పేస్ గ్లోబల్ సప్లై చైన్‌లో ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేందుకు ఇలాంటి కేంద్రాలు దోహదపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, జేఈహెచ్ ఏరోస్పేస్ సీఈవో విశాల్ సంఘావి, సీవోవో వెంకటేష్ ముద్రగళ్ల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు