ఉద్యోగుల ధర్మాగ్రహం

18-11-2026 | 05:30am
  1. ఓపీఎస్ కోసం 1.72 లక్షల మంది సామూహిక సెలవు
  2.    33 జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్మదీక్షలు   
  3. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్
  4. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి 
  5. సామూహిక సెలవుతో సేవలకు ఆటంకం 

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): సీపీఎస్(CPS) (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం(Old Pension System) (ఓపీఎస్) పునరుద్ధరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు(Employees and Teachers) డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తమ గళాన్ని వినిపిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో శాంతియుత ‘ధర్మదీక్ష’లతో కదంతొక్కారు. మొత్తం 2.60 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల్లో(CPS employees) అత్యవసర సేవల్లో ఉన్నవారు మినహా దాదాపు 1.72 లక్షల మంది సామూహిక సెలవు పెట్టి నిరసనల్లో పాల్గొన్నారు.

ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తమకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) నిలబెట్టుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒకేసారి సామూహిక సెలవు పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. అనేక పాఠశాలల్లో బోధనకు అంతరాయం కలగగా, జిల్లా కేంద్రాల్లోని కీలక విభాగాల్లో ప్రజలకు అందాల్సిన సేవలు మందగించాయి.  

మాట ఇచ్చారు.. నిలబెట్టుకోవాలి : స్థితప్రజ్ఞ 

సామూహిక సెలవులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఉద్యోగ, ఉపాధ్యాయులు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో ధర్మదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎస్ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు జి. స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. 2004 నుంచి సుదీర్ఘ ఈ పోరాటం కొనసాగుతుందన్నారు.  2023 ఆగస్టు 12న నిర్వహించిన ’పాత పెన్షన్ సాధన సంకల్ప సభ’లో ’ఓట్ ఫర్ ఓపీఎస్’కు పిలుపునిచ్చామని, నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి వరంగల్ సభలో సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత జడ్చర్ల సభలో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఓపీఎస్ పునరుద్ధరణకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 

అంతేకాకుండా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సైతం పాతపెన్షన్ పునరుద్ధరిస్తామని ప్రకటించారని స్పష్టం చేశారు. మూడేళ్లు గడుస్తున్నా హామీ కార్యరూపం దాల్చకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు అభద్రతకు లోనవుతున్నారని పేర్కొన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా, పాత పెన్షన్ వల్ల ఆర్థిక భారం పడుతుందంటూ కొందరు అధికారులు ఇచ్చే తప్పుడు నివేదికలను పక్కనపెట్టి ప్రభుత్వం నేరుగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారని, అదే తరహాలో తెలంగాణలోనూ అమలు చేయాలని కోరారు. 

సీపీఎస్ రద్దుతో రూ.19 వేల కోట్లు వెనక్కి: కల్వల్ శ్రీకాంత్ 

సీపీఎస్ విధానం అమల్లో ఉండటం వల్ల ప్రభుత్వ వాటా 10 శాతం, ఉద్యోగుల వాటా 10 శాతం కలిపి ప్రతినెలా దాదాపు రూ.200 కోట్లు షేర్ మార్కెట్‌లోకి తరలిపోతూ వృథా అవుతుందని సీపీఎస్‌ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ తెలిపారు. 2004 నుంచి 2026 వరకు దాదాపు రూ.19 వేల కోట్లు ఎన్‌పీఎస్ ట్రస్ట్ ద్వారా షేర్ మార్కెట్‌లో నిలిచాయన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసినట్లయితే ఆ నిధులన్నీ తిరిగి రాష్ట్ర ఖజానాకు చేరుతాయని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఉపయోగపడతాయని వెల్లడించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సానుకూలంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఇ.నరేష్‌గౌడ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కోటకొండ పవన్, రాష్ట్ర సాహితీ కార్యదర్శి రోషన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, హైదరాబాద్ జిల్లా కోశాధికారి శ్యాంసుందర్, కవితశ్రీ, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవూఫ్‌తో పాటు ఉద్యోగ సంఘాల నేతలు సామ శ్రీనివాస్, భాస్కర్‌రావు, మహేష్‌కుమార్, శివాజీ, చంద్రశేఖర్, మోహన్ సింగ్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు