పేదల పాలిట వరం.. చేయూత పెన్షన్లతో ఆర్థిక భరోసా
పెన్షన్ మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి
కంగ్టి, నవంబర్ 17 (విజయక్రాంతి): అర్హులైన పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని,సమాజంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తూ సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి(MLA Patlolla Sanjeeva Reddy) అన్నారు. మంగళవారం కంగ్టి మండలం తుర్కవడగామా గ్రామంలోని పీజీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 490 మంది చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి స్వయంగా పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధులు,దివ్యాంగులు, అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు ఎంతో ఆర్థిక భరోసానిస్తాయని అన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడినవారు,ఆదరణ అవసరమైనవారికి ప్రభుత్వం అండగా నిలవాలన్నదే సంక్షేమ పథకాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.ప్రజల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సంక్షేమ ఫలాలను అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని,లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఒకేసారి 490 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందజేయడంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తమకు ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వానికి,పెన్షన్ మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆయ గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.