అక్రమ నిర్మాణాలపై కొరడా

18-10-2026 | 05:25am
  1. ఆదిభట్లలో అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన 3, 4వ అంతస్తుల కూల్చివేత
  2. సగానికి పైగా భవనాలు నిబంధనల ఉల్లంఘనే.. 
  3. కంటితుడుపు చర్యలు వద్దంటున్న స్థానికులు

ఆదిభట్ల, అక్టోబర్ 17 (విజయక్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా చేపట్టే అక్రమ నిర్మాణాలపై జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు(GHMC Town Planning officials) ఉక్కుపాదం మోపుతున్నారు. శనివారం జీహెచ్‌ఎంసీ  ఆదిభట్ల మున్సిపల్ సర్కిల్ పరిధిలోని టీసీఎస్  కార్యాలయం ఎదురుగా అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన పలు అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రొక్లైన్లతో విరుచుకుపడ్డారు.

ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్  సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేతల ప్రక్రియను చేపట్టారు. ఆదిభట్ల పరిధిలో స్థానిక నిబంధనల ప్రకారం స్టిల్ట్తో పాటు కేవలం రెండు అంతస్తులకు (స్టిల్ట్ + 2) మాత్రమే అనుమతులు ఉన్నాయి. అయితే, కొంతమంది బిల్డర్లు, భవన యజమానులు అధికారుల అనుమతులను గాలికి వదిలేసి మూడో, నాలుగో  అంతస్తులను అక్రమంగా నిర్మించారు. వీటికి సంబంధించి గతంలోనే నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో, శనివారం ఉదయాన్నే రంగంలోకి దిగిన అధికారులు అక్రమంగా నిర్మించిన అంతస్తులను పూర్తిగా తొలగించారు.

చట్టపరమైన చర్యలు తప్పవు: డీసీ 

భవన నిర్మాణాలు చేపట్టే వారు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి మంజూరైన ’అప్రూవ్డ్ ప్లాన్’ ప్రకారం మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని డిసి స్పష్టం చేశారు. ‘నిబంధనలు ఉల్లంఘించి అదనపు అంతస్తులు వేసినా, సెట్బ్యాక్లు వదలకున్నా ఎంతటి వారిపై అయినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా ఏజెంట్లు, అక్రమ అర్బన్ డెవలపర్ల మాటలు నమ్మి అనుమతులు లేని భవనాల్లో ప్లాట్లు లేదా ఇళ్లు కొనుగోలు చేసి మోసపోవద్దు‘ అని ఆయన హెచ్చరించారు.

తుర్కయంజాల్, ఆదిభట్లలో కంటితుడుపు చర్యలేనా?

మరోవైపు ఆదిభట్ల, తుర్కయంజాల్ పురపాలక సంఘాల పరిధిలో వందలాది అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఐటీ కారిడార్ సమీపంలో ఉండటంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ డిమాండ్ను ఆసరాగా చేసుకొని అనేకమంది బిల్డర్లు పర్మిషన్ల కంటే అదనంగా మూడేసి, నాలుగేసి అంతస్తులు నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు కేవలం ఒక్కటి రెండు భవనాలపై చర్యలు తీసుకొని కంటితుడుపు చర్యలతో మమ అనిపిస్తున్నారని,తుర్కయంజాల్, ఆదిభట్ల పరిధిలోని ప్రతి అక్రమ నిర్మాణంపై నిర్దాక్షిణ్యంగా కొరడా ఝుళిపించాలని స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను మొదటి దశలోనే అడ్డుకోకుండా పూర్తయ్యాక చర్యలు తీసుకోవడం వల్ల నిధుల వృథాతో పాటు ప్రజలు నష్టపోతున్నారని, ఇకనైనా అధికారులు కఠిన పర్యవేక్షణ పెంచాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు