శివనగర్–పెద్ద కంజర్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలి

10-11-2026 | 04:52pm

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తట్టెడు మట్టి కూడా తీయలేదు

బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి

పటాన్ చెరు, నవంబర్ 10 : పటాన్‌చెరు నియోజకవర్గ(Patancheru Constituency) అభివృద్ధిని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు విస్మరించాయని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి(BJP Leader Godavari Anjireddy) విమర్శించారు. శివనగర్ నుంచి పెద్ద కంజర్ల(Pedda Kanjarla from Shivanagar) వరకు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ(BJP) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా నియోజకవర్గంలో కనీస అభివృద్ధి పనులు చేపట్టలేదని, తట్టెడు మట్టి కూడా తీయలేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలోనూ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

అధ్వానంగా మారిన రోడ్లతో ప్రజలు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే శివనగర్ – పెద్ద కంజర్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిన్నారం మున్సిపాలిటీ అధ్యక్షుడు జగన్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు