ఏడాదికి రూ.20.. కుటుంబానికి రూ.2 లక్షల బీమా భరోసా
కొమురవెల్లి (విజయక్రాంతి): కుటుంబ పెద్దకు అనుకోని సంఘటన జరిగి మరణిస్తే ఆ కుటుంబానికి తీరని నష్టం వాటిల్లుతుందని, అలాంటి సమయంలో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు బీమా (Insurance) ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (Telangana Grameena Bank) కొమురవెల్లి శాఖ మేనేజర్ సంతోష్ సూచించారు.
కొమురవెల్లి గ్రామానికి చెందిన సార్ల బాలయ్య మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గతంలో స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతాదారుడిగా ఉంటూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (Pradhan Mantri Suraksha Bima Yojana) కింద ఏడాదికి రూ.20 ప్రీమియం (Premium) చెల్లించారు. ఆయన మరణానంతరం బీమా క్లెయిమ్ ప్రక్రియ పూర్తికావడంతో రూ.2 లక్షల బీమా మొత్తానికి సంబంధించిన చెక్కును ఇటీవల బ్యాంకు మేనేజర్ సంతోష్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఏడాదికి కేవలం రూ.20 ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రమాదవశాత్తు మరణం లేదా ప్రమాదం కారణంగా అంగవైకల్యం సంభవించినప్పుడు నిబంధనల ప్రకారం రూ.2 లక్షల వరకు బీమా రక్షణ లభిస్తుందని వివరించారు. తమ ఖాతాదారుల కోసం బ్యాంకులో పలు బీమా పథకాలు (Insurance Schemes) అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కుటుంబ ఆర్థిక భద్రత కోసం ప్రతి ఒక్కరూ బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు మిత్ర కొంక లక్ష్మి, మహేష్, గ్రామ పెద్దలు గొల్లపల్లి కిష్టయ్య, స్వాములపల్లి కనకాచారి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.