బ్రదర్ లూర్ధు రెడ్డి, హెచ్ఎం వినోద్ రెడ్డిలకు ఘన సన్మానం

15-11-2026 | 06:25pm

మఠంపల్లి నవంబర్ 15 (విజయక్రాంతి): 1985-86 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం(Alumni Reunion) సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు బ్రదర్ లూర్ధు రెడ్డి, వివిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు వినోద్ రెడ్డిలను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువులను కలిసి శాలువాలు, పూలమాలలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నాటి పాఠశాల రోజుల్లోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు.

అనంతరం అప్పట్లో తాము విద్యనభ్యసించిన వివిహెచ్ఎస్ పాఠశాలను కలియతిరుగుతూ తరగతి గదులు, పాఠశాల ప్రాంగణాన్ని సందర్శించారు. చదువుకున్న రోజులు, గురువుల బోధనలు, తోటి విద్యార్థులతో గడిపిన ఆనంద క్షణాలను నెమరువేసుకున్నారు.

దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కలుసుకుని సన్మానించడం ఎంతో ఆనందంగా, భావోద్వేగంగా ఉందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. గురువుల సేవలను ఎప్పటికీ మరువలేమని, వారి ఆశీస్సులు తమకు ఎంతో విలువైనవని తెలిపారు. ఈ కార్యక్రమం గురు-శిష్యుల మధ్య ఉన్న అనుబంధానికి, కృతజ్ఞతాభావానికి నిదర్శనంగా నిలిచింది.

మరిన్ని వార్తలు