కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
* చెరిపేస్తే చెరిగేది కాదు కేసీఆర్ చరిత్ర
* తెలంగాణ సాధనలో నవంబర్ 29 మరువలేని రోజు
* డిసెంబర్ 10న నల్లగొండలో జరిగే కేటీఆర్ సభను విజయవంతం చేయాలి
- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.
సూర్యాపేట, నవంబర్ 29 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా కేసీఆర్(KCR) నాయకత్వమే శ్రీరామరక్ష అని, చెరిపేస్తే చెరిగేది కాదు ఆయన చరిత్ర అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Guntakandla Jagadish Reddy) అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో(BRS Party Office) నిర్వహించిన 'దీక్షా దివస్' కార్యక్రమానికి('Deeksha Divas' program) ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమ్మ విలువ, అన్నం విలువ అవి లేనప్పుడే తెలిసినట్టు, నేడు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విలువ అర్థమవుతోందన్నారు.
పార్టీ ఏర్పాటు ఎంత కీలకమో, తెలంగాణ సాధనలో దీక్షా దివస్ అంతే కీలకమైన రోజని, కోట్లాది గొంతుకలను ఏకం చేసి, చావు నోట్లో తలపెట్టి ఆమరణ దీక్ష చేయడం ద్వారా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే(KCR) దక్కుతుందని తెలిపారు. 60 ఏళ్ల నిర్లక్ష్యాన్ని ఎండగట్టి, అభివృద్ధి, సంక్షేమాలతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన నాయకుడు కేసీఆరేనని, ఆయన త్యాగాన్ని ముందు తరాలకు తెలియజేసేందుకే దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి, పాలన చేతకాక అన్ని రంగాలను బ్రష్టుపట్టించిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సమైక్యాంధ్ర వాదుల తొత్తుగా మారిందని ఆరోపించిన జగదీష్ రెడ్డి, ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలపై(Krishna and Godavari waters) తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి డిసెంబర్ 10న నల్లగొండలో కేటీఆర్ నిర్వహించనున్న నీళ్లపై పోరాట సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పెరుమాల్ల అన్నపూర్ణ, మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ లతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.