మద్దిరాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
పోలింగ్ కేంద్రాలు, అంగన్‌వాడీల నిర్వహణపై ఆరా
అనర్హులను తొలగించి అర్హులకే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు: కలెక్టర్
సూర్యాపేట, నవంబర్ 29 (విజయక్రాంతి) : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార దినోత్సవం(MLC Election Campaign Day) సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్(Suryapet Collector Tejas Nandlal Pawar) ఆదివారం జిల్లాలోని మద్దిరాల మండలంలో ఆకస్మిక పర్యటన చేశారు. ముందుగా మద్దిరాల గ్రామంలోని 665, 666 నంబర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి బీఎల్‌వోలతో మాట్లాడి ఓటర్ల జాబితా(Voters' List), పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎన్నికల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు.
అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను పరిశీలించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గుడ్లు, పాలు, పోషకాహారం సక్రమంగా అందుతోందా లేదా అని సిబ్బందిని ప్రశ్నించారు. పాఠశాల భవనాల పరిస్థితిపై చర్చించారు. అనంతరం గ్రామ కార్యదర్శితో గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కేజీబీవీ, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు నీటి సరఫరా పరిస్థితిపై దృష్టి సారించారు. నీటి సరఫరాకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక వెంటనే పంపాలని అధికారులను ఆదేశించారు.
అనర్హులను తీసేసి అర్హులకే ఇండ్లు:
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులో ఈ సమస్యలు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇండ్ల కేటాయింపుపై ఫిర్యాదులు వస్తే క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలించాలని తహసీల్దార్‌కు సూచించారు. జాబితాలో అనర్హులు ఉంటే వారిని తొలగించి, నిజమైన అర్హులకే ఇండ్లు కేటాయించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తబిత, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.