అనర్హులకు పెన్షన్లు.. అర్హులకు మొండిచేయి

21-11-2026 | 05:20am

దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఆధార్‌కార్డుల దుర్వినియోగం...

అర్హులైనా అందని చేయూత పెన్షన్

ఉట్నూర్, నవంబర్ 20 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయూత పెన్షన్లు(Cheyutha Pensions) మంజూరులో అర్హులకు జిల్లాలో అ న్యాయం జరుగుతోంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో చేయూత పెన్షన్లకు అర్హత ఉన్న వారి ఆధార్ కార్డులను తెలియని వారు వాటిని ఉపయోగించి వారి పేర్లతో రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్లాట్లు, వాహనాలు కొనుగోలు చేయడంతో చేయూత పెన్షన్లు మంజూరు కాలేదు. అనర్హలుగా ఉన్నవారికి  వైద్య శాఖ ద్వారా సదరం సర్టిఫికెట్లు జారీ కావడంతో వారికి చేయూత పెన్షన్లు మంజూరయ్యాయి.

రాష్ట్రంలో 4.62 లక్షల మం దికి మంజూరు చేసిన చేయూత పెన్షన్లలో అర్హులుగా ఉండి రోజువారీగా జీవనం సాగిస్తున్న పేదలకు చేయిత పింఛన్లు మంజూరు కాకపోవడంతో లబోదిబోమంటూ  అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలోని గ్రామాలలో రోజువారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వితంతువులు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు మంజూరు కాలేదు.

ఇటీవల మంజూరు చేసిన చేయూత పింఛన్ల మంజూరు కొరకు వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన సదరం సర్టిఫికెట్ల పై క్షుణంగా పరిశీలన జరిపితే మంజూరైన వారిలో వైద్యులను బోల్తా కొట్టి సదరం సర్టిఫికెట్లు తీసుకువచ్చి పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలనకు వచ్చిన అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే  ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు మంజూరు చేసిన చేయూత పెన్షన్లపై విచారణ జరపాలని  ప్రజలు కోరుతున్నారు.

షాద్‌నగర్‌లో ఫ్లాట్ పేరుతో మంజూరుకు దూరం..

45 శాతం వికలాంగతో ఉండి చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 45 శాతం వికలాంగుడుగా ఉన్నట్లు వైద్యులు సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలనకు వచ్చిన అధికారి ఆధార్ కార్డు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయగా వికారాబాద్ జిల్లాలోని షాద్ నగర్ లో లబ్ధిదారుడు తండ్రి పేరుతో  ప్లాట్ ఉన్నట్లు ఆన్లైన్లో చూపించింది. ఆ ప్లాట్ ను ఐదేళ్ల క్రితం విక్రయించారు. అయినా ఆ కుటుంబం పేరుతో ప్లాట్ చూపిస్తుంది. దీంతో పర్యవేక్షణ అధికారి చేయూత పెన్షన్లు రిజెక్ట్ చేశారు.

పిప్పలవారి సందీప్ శర్మ,  వికలాంగుడు

హైదరాబాదే తెలియదు.. నగరంలో ప్లాటు..

ఈ మహిళా పేరు అరటి స్వప్న.. ఈ మహిళ  ఒంటరిగా ఇద్దరు పిల్లలు పట్టుకొని రోజువారి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తుంది. స్వప్న పేరుతో  హైదరాబాద్ లో ప్లాట్ కొనుగోలు చేసినట్లు ఆధార్ కార్డు ద్వారా ఆన్లైన్లో నమోదయి ఉంది. ఈ మహిళ జిల్లా కేంద్రం తప్ప నేటికీ నిర్మల్ జిల్లా కేంద్రానికి సైతం వెళ్లలేదు. అయినా హైదరాబాదులో ప్లాట్ ఉందంటే ఆశ్చర్య పోవాల్సిందే. ఈ మహిళా పేరుతో ఉన్న ఆధార్ కార్డును గుర్తు తెలియని వాళ్ళు ఉపయోగించుకున్నట్లు, దీంతో చేయూత పెన్షన్ కు దూరమైంది.

 అరటి స్వప్న, ఒంటరి మహిళ

వితంతు పేరుతో ప్లాట్లు.. ఖరీదైన కార్లు..

గుడిహత్నూర్ మండలం తోశం పంచాయతీ పరిధిలోని టాకీ గుడా గ్రామానికి చెందిన  భాగ్యశ్రీ వితంతువు. భర్త ట్రాక్టర్ డ్రైవర్ గా  హైదరాబాదులో పని చేస్తున్న సమయంలో ట్రాక్టర్ యజమాని భాగ్యశ్రీ ఆధార్ కార్డును  తీసుకున్నారు. అక్కడి ట్రాక్టర్ యజమాని   ఆమె ఆధార్ కార్డు సహాయంతో హైదరాబాదులో ప్లాటు, ఖరీదైన కార్లు కొనుగోలు చేసినట్లు చేయూత పెన్షన్ దరఖాస్తు పరిశీలన బయటకు వచ్చింది. ఆర్థికంగా బాగున్నట్లు పరిశీలనాధికారి  భాగ్యశ్రీ చేయూత పెన్షన్ దరఖాస్తులు రిజెక్ట్ చేశారు. దీంతో భాగ్యశ్రీ కి పింఛన్ రాలేదు. ఇద్దరు పిల్లల్ని పట్టుకొని రోజు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్న భాగ్యశ్రీ కి అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు.         

 భాగ్యశ్రీ, గుడిహాత్నూర్ మండలం..


మరిన్ని వార్తలు