పిహెచ్‌సీని తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి

07-11-2026 | 10:51pm

భీంపూర్,(విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక అధికారి గోపి కిషన్,స్థానిక నాయకులతో కలిసి శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను తిరుగుతూ వైద్య సేవలు, పరిశుభ్రత, మందుల నిల్వలను ఆయన స్వయంగా పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా ఆసుపత్రిలోని స్కానింగ్ మిషన్ పనిచేయడం లేదని, దెబ్బతిని మూలనపడి ఉందని గమనించిన ప్రత్యేక అధికారి అసహనం వ్యక్తం చేశారు. స్కానింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రోగులు, ముఖ్యంగా గర్భిణులు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు.

వెంటనే స్పందించిన ప్రత్యేక అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తో ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడారు. స్కానింగ్ మిషన్‌ను తక్షణమే రిపేర్ చేయించి, తిరిగి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రోగులకు అందించే వైద్య సేవల్లో ఎలాంటి అలసత్వం వహించవద్దని సిబ్బందిని హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చే నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని, వార్డులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంజన రవీందర్,మాజీ సర్పంచ్ మాడవి లింబాజి,పురుషోత్తం, పాండురంగ్, ఆరోగ్య విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్, పిహెచ్‌సీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు