ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన

07-11-2026 | 10:51pm

జలసిరి నీటి సంరక్షణపై గ్రామసభలో చర్చ.

కోనరావుపేట నవంబర్ 7 (విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని(Konaraopeta Mandal) పల్లిమక్త గ్రామంలో ఎల్‌నినో ప్రభావంతో(impact of El Niño) వ్యవసాయం(Agriculture), పంటల దిగుబడి, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతపై రైతులు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించేందుకు సర్పంచ్ జిన్న అనూష అనిల్ కుమార్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి శ్రీదేవి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని, వీటి ప్రభావం పంటల సాగు, దిగుబడిపై పడుతుందని వివరించారు.

రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు.అలాగే గ్రామంలో అమలవుతున్న జలసిరి కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, నీటి వనరులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.అనంతరం రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో విధిస్తున్న నిబంధనల ప్రకారం వడ్లను పట్టడం సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు రావాల్సిన ధాన్యం విక్రయ డబ్బులతో పాటు బోనస్ మొత్తాన్ని కూడా వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని గ్రామసభలో తీర్మానం చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్, పంచాయతీ కార్యదర్శి, సింగిల్ విండో డైరెక్టర్, ఇరిగేషన్ అధికారి, విద్యుత్ లైన్‌మెన్, ఆశా వర్కర్, మహిళా సంఘం వీఓఏ, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు