జిల్లాలో పర్యటిస్తున్న ట్రైనీ ఐఏఎస్ అధికారులు
మున్సిపల్ పని తీరుపై అధ్యయనం
ఆదిలాబాద్,(విజయక్రాంతి): శిక్షణలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న 18 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు(Trainee IAS Officers) మున్సిపాలిటీ పరిధిలోని వివిధ విభాగాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిపాలనా విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని రెవెన్యూ సెక్షన్, టౌన్ ప్లానింగ్ విభాగం, మ్యూటేషన్ సెక్షన్, ఎస్టాబ్లిష్మెంట్, ఇంజనీరింగ్ విభాగాలతో పాటు డంపింగ్ యార్డ్, వాటర్ సెక్షన్, పంప్ హౌస్ లను సందర్శించి ఆయా విభాగాల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలు, పరిపాలనా ప్రక్రియల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్(Municipal Chairperson Bandari Anusha Satish) అధ్యక్షతన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, పన్నుల వసూళ్లు, పట్టణ ప్రణాళిక, భవన నిర్మాణ అనుమతులు, మున్సిపల్ అభివృద్ధి పనులు, ప్రజలకు అందిస్తున్న పౌర సేవలు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, ఇంజనీర్లు, తహసీల్దార్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.