గ్రామీణ క్రీడల అభివృద్ధికి సహకరిస్తా

05-11-2026 | 09:55pm

పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో బాల్ బ్యాడ్మింటన్‌కు చోటు కల్పించే ప్రతిపాదన

క్రీడాకారులకు సీపీ ఎన్. శ్వేత భరోసా

హనుమకొండ,(విజయక్రాంతి): క్రీడల అభివృద్ధి(Sport development)కి, క్రీడాకారుల ప్రోత్సాహానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత(Warangal CP N. Swetha) అన్నారు. హనుమకొండలోని జేఎన్ఎస్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించిన ఆమె క్రీడాకారులతో సరదాగా కాసేపు ఆట ఆడుతూ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధించిన నియమాలు, ప్రత్యేకతలు, క్రీడాకారులకు అందుతున్న అవకాశాలు, ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఆదరణ కలిగిన బాల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రీడ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో బాల్ బ్యాడ్మింటన్ క్రీడను కూడా చేర్చే విధంగా ప్రతిపాదనను పరిశీలిస్తామని తెలిపారు. బాల్ బ్యాడ్మింటన్‌లో ప్రతిభ కనబరిచి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులను ఈ సందర్భంగా సీపీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ రవీంద్ర కుమార్, హనుమకొండ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షులు మల్లారెడ్డి, సెక్రటరీ శ్రీనివాస్ ,సీనియర్ క్రీడాకారులు రిటైర్డ్ ఎమ్మార్వో ప్రసాద్, డిప్యూటీ ఎమ్మార్వో రవీందర్, రిటైర్డ్ ఎస్ ఐ కొమురయ్య, శ్రీనివాస్ రెడ్డి, ముత్తయ్య ,రాజేందర్ రెడ్డి, సాత్విక్, చిరంజీవి, శ్రీధర్ ,ఎల్ల స్వామి, మహేష్  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు